గూగుల్ వంటి అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ భారత్‌లో భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సహజంగానే దాని మొదటి ప్రాధాన్యత బెంగళూరు అవుతుంది.
అయినప్పటికీ దాని కోసం ఆంధ్రా, తెలంగాణలతో సహా అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరికి దానిని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది!
కానీ బెంగళూరుకి వెళ్ళాల్సిన గూగుల్ ఎందుకు విశాఖ బాట పట్టింది?అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భారీ రాయితీలే అని కర్ణాటక ప్రభుత్వం ఎద్దేవా చేస్తోంది. కానీ గూగుల్ వంటి కంపెనీ బెంగళూరుని కాదని విశాఖకు వెళ్ళిపోతే రాబోయే రోజుల్లో బెంగళూరుకి ఎంత నష్టం జరుగబోతోందో వారికీ తెలుసు. అందుకే ఈ ఏడ్పులు!
కానీ ఏపీపై పడి ఏడ్చే బదులు బెంగళూరులో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని ఐటి కంపెనీలు పిర్యాదులపై సానుకూలంగా స్పందించి, యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేయించి ఉంటే గోటితోనే పోయేది.
కానీ ‘ఉంటే ఉండండి పోతే పొండని…’ ఆ రాష్ట్ర మంత్రులు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడి గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. పైగా ‘రాయితీలు ఇచ్చి ఐటి కంపెనీలు తెచ్చుకోవలసిన ఖర్మ మాకు పట్టలేదంటూ…’ చాలా అహంకారంగా మాట్లాడారు. కనుక ఖచ్చితంగా ఇది వారి స్వయంకృతమే.
బెంగళూరులో గుంతలు పడిన ఆ రోడ్లపై ప్రతీరోజూ నరకయాతన అనుభవిస్తూ, పాలకుల అహంకారాన్ని, వారి చేసే అవమానాలను భరించడం కంటే రెడ్ కార్పెట్ పరిచి, రాయితీలు ఇచ్చి సాదరంగా స్వాగతం చెపుతున్న ఏపీకి తరలిపోవడం మంచిదని ఐటి కంపెనీలు అనుకోకుండా ఉంటాయా?
ఇప్పటికిప్పుడు కాకపోయినా గూగుల్ కారణంగా రాబోయే రోజుల్లో విశాఖ ఐటి రాజధానిగా అభివృద్ధి చెందుతుంటే, బెంగళూరుని అంటిపెట్టుకొని ఉంటాయా?
గూగుల్ కోసం ఏపీ ప్రభుత్వం చాలా భారీగానే రాయితీలు ఇచ్చి ఉండవచ్చు. కానీ ఒక్క గూగుల్‌ని రప్పించగలిగితే మిగిలిన దిగ్గజ సంస్థలు వాటంతట అవే విశాఖ తీరానికి చేరుకుంటాయి. ఈ విషయం కర్ణాటక మంత్రులకు కూడా బాగా తెలుసు. కనుకనే ఆగ్రహం, అసూయతో రగిలిపోతున్నారు.
కానీ వారి అసమర్ధత, నిర్లక్ష్య ధోరణే ఏపీకి వరంగా మారుతుండటం చాలా ఆశ్చర్యకరమే కదా?గూగుల్ కంపెనీ విశాఖకు వస్తుంటే ఏడ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. మొదట వైసీపీ కూడా ఏడ్చింది. కానీ తర్వాత ‘అది ఏపీకి రావడానికి కారణం నేనే’ అంటూ జగన్ కూడా ఈ క్రెడిట్ కోసం ఆరాటపడటం గమనిస్తే దానిని సాధించడం ఎంత గొప్ప విషయమో అర్ధమవుతుంది.
అయినా సండూర్ వంటి కంపెనీలకు వేల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేయగల గూగుల్ కంపెనీకి రాయితీలు ఇస్తే తప్పెలా అవుతుంది?
గూగుల్ విశాఖకు వస్తుంటే ఇంతమంది అసూయతో కడుపు మంటతో ఏడుస్తున్నారంటేనే దాని విలువ ఏమిటో అర్ధమవుతోంది కదా?




