టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి పై మీసం మెలేసి అందరి కళ్ళలో పడి ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అయ్యారు గోరంట్ల మాధవ్. అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన టీడీపీ మీద బలంగానే విరుచుకుపడతారు. అయితే ఆయన స్వగ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి టీడీపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చారు.
గోరంట్ల మాధవ్‌ది కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామం. అక్కడ టీడీపీ మద్దతు అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గోరంట్ల మాధవ్‌కు దగ్గర బంధువు అవుతారు. దీంతో మధుకు మాధవ్ మద్దతు కూడా ఇవ్వడంతో ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. అయితే దీని మీద మాధవ్ పై సొంత పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
పార్టీని సమర్ధించకుండా బంధువుకు మద్దతిచ్చారంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే మాధవ్ మాత్రం తాను తన నియోజకవర్గం ఎన్నికలలో బిజీగా ఉన్నా అని… రుద్రవరం ఎన్నికలతో తనకు సంబంధం లేదని చెప్పుకొస్తున్నారట.
అయితే ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి జగన్ ఎలా తీసుకుంటారు అనేది చూడాలి. ఒకవేళ జగన్ ఈ విషయంగా సీరియస్ అయితే మాత్రం మాధవ్ కు ఇబ్బందే అని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆయనకు నియోజకవర్గంలోని మిగతా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు పొసగడం లేదని… వారు ఇప్పటికే చాలా సార్లు ఆయన మీద కంప్లయింట్లు చేశారని తెలుస్తుంది.





