విశాఖ డ్రామా పూర్తవనే లేదు… అప్పుడే భోగాపురం, మెట్రో డ్రామాలా?

Gudivada Amarnath YV Subba Reddy

మూడు రాజధానుల గురించి మొదట్లో డప్పుకొట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. పోనీలే… అంతా ఏపీ మంచికే అని సరిపెట్టుకోవచ్చు.

ఆ తర్వాత సిఎం జగన్‌ విశాఖలో మకాం అనే విశాఖ రాజధాని డ్రామా మొదలుపెట్టి ఏడాదిన్నరగా చాలా రసవత్తరంగా నడిపించారు. కానీ స్వయంగా పెట్టుకొంటున్న ముహూర్తాలన్నీ దాటిపోయాయి కానీ జగన్మోహన్‌ రెడ్డి విశాఖకు రానేలేదు!

ADVERTISEMENT

ఎందుకని అడిగేందుకు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు లేరిప్పుడు. విశాఖ, ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలు కూడా అడగడం లేదు. కనుక వైసీపి ప్రభుత్వం ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరమే లేదు. కనుక ఎన్నికలకు ముందు మళ్ళీ మరో ముహూర్తం పెట్టుకొని హడావుడి చేస్తారేమో?

అయితే విశాఖా రాజధాని డ్రామాని ప్రజలు నమ్మడం లేదనే విషయం వైసీపి నేతలు గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే ఇప్పుడు విశాఖ పక్కనే ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అంటూ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు.

శనివారం మన వెరీగుడ్డు మంత్రి అమర్నాద్‌, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు కలిసి భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలన పేరుతో అక్కడకు వెళ్ళి హడావుడి చేశారు.

తర్వాత మన మంత్రి అమర్నాద్‌ మీడియాతో మాట్లాడుతూ, “భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముందుగా 23 కిమీ ప్రహారీ గోడ, 3.08కిమీ రన్ వే నిర్మాణ పనులు చేస్తున్నారు. 2025నాటికల్లా విమానాశ్రయ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయి. ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నిబద్దత, చిత్తశుద్ధికి ఇదే ఓ గొప్ప నిదర్శనం,” అని అన్నారు.

కడప స్టీల్ ప్లాంట్ గురించి వైసీపి మంత్రులు ఇలాగే చెప్పుకొన్నారు. దానికీ ఇలాగే ముందుగా ప్రహారీ గోడ నిర్మాణం మొదలుపెట్టారు. కానీ అదీ పూర్తిచేయలేకపోయారు.

ఓ స్టీల్ ప్లాంట్ లేదా ఓ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం కంటే వాటి ప్రహారీ గోడ, రన్ వే పేరుతో ఓ రోడ్డు నిర్మించడమే చాలా సులువు. కనుక వీటితో అక్కడ ఏదో శరవేగంగా నిర్మాణ పనులు జరిగిపోతున్నట్లు ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు.

ఎన్నికలకు ఇంకా 3-4 నెలలే సమయం ఉంది. అందుకే ఇప్పుడు విశాఖ నగరంలో మెట్రో రైల్ అంటూ సమాంతరంగా మరో డ్రామా కూడా మొదలుపెట్టారు. ఇంతకీ మంత్రివర్గం డీపీఆర్‌ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారుచేసేందుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉండే ఈ ప్రాజెక్టుని ఎలాగూ ఇప్పటికిప్పు నిర్మించలేదు. మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో కూడా తెలీదు కూడా.

కనుక వైసీపి ప్రభుత్వం విమాశ్రయం, మెట్రో అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిందని అనుకోవచ్చు. కానీ ప్రజలు తమ డ్రామాలను ప్రజలు అర్దం చేసుకోలేరనుకొనే కేసీఆర్‌ అంతటివాడు బోర్లా పడ్డారని వైసీపి నేతలు గుర్తుంచుకొంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories