భారీ అంచనాలతో విడుదలైన “స్పైడర్” సినిమాలోని మొదటి పాట ‘బూమ్ బూమ్’ శ్రోతలను నిరాశపరిచిన విషయం తెలిసిందే. వినగా వినగా ‘సోసో’గా ఉన్న ఆ పాటకు కొనసాగింపుగా రెండవ పాట ప్రేక్షకులను పలకరించింది. ‘పుచ్చకాయ పుచ్చకాయ’ అనే ఈ పాట కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా హరీష్ జయరాజ్ అందించిన ఈ పాట ట్యూన్, ఇంతకుముందే విన్నట్లుగా ఉండడం, బ్రిజేష్ పాడిన ఈ స్వరం మహేష్ కు ఏ మాత్రం సూట్ కాకపోవడం ఫస్ట్ లిజెన్ లోనే ఫెయిల్ అయ్యింది.
ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలలో కూడా తెలుగుదనం పూర్తిగా లోపించాయి. బహుశా దర్శకుడు మురుగదాస్ తమిళ ట్యూన్స్ ను రికార్డు చేయించి, తెలుగు రచయితల చేత రాయించినట్లుగా అర్ధమవుతోంది. మొదటి పాట ఇలాగే జరిగిందని ఇప్పటికే రచయిత రామజోగయ్య శాస్త్రి స్పష్టం చేయగా, తాజాగా రెండవ పాట పరిస్థితి కూడా ఇదేనని అర్ధం చేసుకోవచ్చు. దీంతో “స్పైడర్” ఆల్బమ్ పై అంచనాలు పూర్తిగా తగ్గిపోగా, ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్కటి కూడా ప్రేక్షకులలో పాజిటివ్ అంశం చోటు చేసుకోకపోవడం, పబ్లిసిటీ పరంగా దాదాపుగా ఫెయిల్ అయినట్లే భావించవచ్చు.
ఇక ధియేటిరికల్ ట్రైలర్ ఏమైనా ఊహలకు మించి ఉంటే తప్ప, “స్పైడర్” సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవ్వడం అసాధ్యం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారని చెప్పినప్పటికీ, పాటల ద్వారా తమిళంకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం తేటతెల్లమైంది. దీంతో తెలుగు ప్రేక్షకుల నుండి నెగటివ్ రియాక్షన్స్ తెచ్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది “స్పైడర్” ఓపెనింగ్స్ కు ఏ మాత్రం మంచిది కాదన్న విషయం స్పష్టం. అసలు ట్విస్ట్ ఏమిటంటే… మొదటి పాటను ముందుగా సావన్ మరియు జియో ట్యూన్స్ లో విడుదల చేసిన చిత్ర యూనిట్, రెండవ పాటను ‘వ్యాంక్.ఇన్’లో విడుదల చేసింది.


