అంతరిక్షంలో ఉపగ్రహాలను, బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణులను తయారుచేస్తున్న భారత్, సొంతంగా పౌర విమానాలు తయారుచేసుకోలేదా?విమానాల కోసం ఇంకా విదేశాలపైనే ఆధారపడాలా?అనే ప్రశ్నకు భవిష్యత్తులో అవసరం ఉండదని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) హామీ ఇస్తోంది.
దీని కోసం హెచ్ఏఎల్ రష్యాకు చెందిన యునైటడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కార్పోరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పధకం ద్వారా గత 10 ఏళ్ళుగా భారత్‌లో చిన్న పట్టణాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
కనుక భారత్ అవసరాలకు తగినట్లుగా ముందుగా ఎస్‌జె-100 జెట్ మోడల్ చిన్న విమానాలను అవి దేశీయంగా తయారుచేస్తాయి. రెండు ఇంజన్లు కలిగిన ఈ చిన్న విమానాలలో 103 మంది ప్రయాణించవచ్చు. చిన్న విమానాల నిర్వహణ వ్యయం తక్కువ కనుక వీటితో దేశంలో ఎక్కువ పట్టణాలకు విమాన సేవలు విస్తరించవచ్చు,
రష్యా కంపెనీ ఇంతవరకు ఇటువంటివి 200 విమానాలు తయారుచేసి భారత్‌తో అనేక దేశాలకు అమ్మింది. కానీ ఇప్పుడు మన దేశానికే ఇటువంటివి కనీసం 200 విమానాలు అవసరమున్నట్లు పౌర విమానయాన శాఖా అంచనా వేసింది.
కనుక ఈ విమానాలు అందుబాటులోకి తెస్తే ఇది భారత పౌర విమానరంగంలో పెను మార్పులు తెస్తుంది. అప్పుడు మరిన్ని ప్రైవేట్ సంస్థలు కూడా పౌర విమానయాన సేవలు అందించగలుగుతాయి.
ఈ ఎస్‌జె-100 జెట్ విమానాలు కేవలం భారత్ అవసరాలు తీర్చడమే కాకుండా హెచ్ఏఎల్ సొంతంగా విమానాలు తయారు చేయగలుగుతుంది.
ఇప్పుడు ఇస్రో ఏవిదంగా అమెరికాతో సహా అనేక దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి భారత్‌కు వేల కోట్లు ఆదాయం సమకూర్చుతోందో, అదే విధంగా భవిష్యత్తులో హెచ్ఏఎల్ కూడా ‘మేడిన్ ఇండియా’ పౌర విమానాలు తయారు చేసి విదేశాలకు అమ్ముతూ భారీగా ఆదాయం సమకూర్చగలదు.
ఈ ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు కలిసి భారత్‌లోనే ఎస్‌జె-100 జెట్ విమానాలు తయారు చేయడం మొదలుపెడితే భవిష్యత్తులో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో లేదా ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడం ఖాయం. అప్పుడు ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. కనుక ఈ రంగంలో నైపుణ్యం, డిగ్రీ, అర్హతలు సాధించేందుకు కొత్త కోర్సులు, కొత్త యూనివర్సిటీలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
కనుక ఎస్‌జె-100 జెట్ విమానాల తయారీ కోసం భారత్-రష్యాల మద్య జరిగిన ఈ ఒప్పందం, పరిశ్రమల ఏర్పాటుకి జరిగే సాధారణ ఒప్పందాల వంటిది కాదు. అభివృద్ధి పధంలో భారత్ వేస్తున్న అతిపెద్ద అడుగని భావించవచ్చు.







