“నేను.. శైలజ…” సినిమా రివ్యూపై ‘ట్విట్టర్’ వేదికగా ఒక మీడియా ఛానల్ ను ఉద్దేశించి హీరో రామ్ వ్యక్తం చేసిన ఆవేదనకు మళ్ళీ ఆ ఛానల్ కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు, “నేను.. శైలజ…” సినిమాకు కనీస కలెక్షన్లు లేవని దుమ్మెత్తి పోసింది. అలాగే హీరో రామ్ స్థాయి పడిపోతోందని, స్టార్ స్టేటస్ ఉందని చెప్పుకునే రామ్ సినిమా కలెక్షన్స్, ఇప్పుడిప్పుడే వస్తున్న ఒక కొత్త హీరో సినిమా అయిన ‘జత కలిసే’ కంటే తక్కువగా ఉన్నాయంటూ… నైజాం, సీడెడ్ కలెక్షన్స్ ను తెలిపింది. ఎక్స్ ప్రెషన్స్ లేని హీరోయిన్, డైలమాలో ఉన్న హీరో చేసిన “నేను.. శైలజ…” సెకండాఫ్ పాత సినిమాలను పోలి ఉండడం చేత బాక్సాఫీస్ వద్ద చతికిల పడినట్లుగా కధనాలు ప్రసారం చేసింది.
మరి దీనికి రామ్ ఏ విధంగా స్పందిస్తారో గానీ, డైరెక్ట్ గా హీరోను టార్గెట్ చేస్తూ సదరు మీడియా ఛానల్ ప్రసారం చేసిన కధనంపై సినీ వర్గీయులు మండిపడుతున్నారు. ఓ పక్కన “నేను.. శైలజ…” సినిమా మంచి వసూళ్లు రాబడుతూ తెలుగు సినీ పరిశ్రమకు కొత్త సంవత్సరంలో మంచి శుభారంభాన్ని ఇవ్వడమే కాకుండా, రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలబడుతున్న తరుణంలో… దీనికి పూర్తి వ్యతిరేకంగా సదరు మీడియా ఛానల్ చేసిన ప్రసారాలు… ఆ మీడియా సంస్థకున్న ప్రాధాన్యతను తగ్గిస్తోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
బహుశా రామ్ నటించిన “శివమ్” వంటి సినిమాకు ఇలాంటి కధనాలే ప్రసారం చేస్తే అందరూ సమర్థించే వారని, ఉన్న సత్యానికి దూరంగా ప్రసారాలు చేయడం… కేవలం ఉద్దేశపూర్వకమైన చర్యగానే మిగిలిపోతుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ట్విట్టర్ వేదికగా రామ్ వ్యక్తపరిచిన భావాలలో విమర్శలకు తావిచ్చేది ఏది లేదని, కేవలం తన మనసులోని ఆవేదనను చెప్తూ, మీడియా నైతికతను పాటించాల్సిందిగా సూచించారని ‘ఎనర్జిటిక్ స్టార్’ అభిమానులు అంటున్నారు.





