అధికారం కోసం రాజకీయ నాయకులు ఎందుకు ప్రాకులాడుతారు..?
రాష్ట్రాలను ఎన్ని ముక్కలైనా చేసుకోవడం కోసమా?
అధికారం అండతో అవినీతి సంపాదన కోసమా?
ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికినా సమాధానం చెప్పలేనంత ప్రభావితం చేయడం కోసమా?
ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకా?
లేక…
ప్రజలను సేవ చేయడానికా…? ఇదైతే కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజాసేవ తప్ప రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారని ప్రజలు బలంగా విశ్వసించే రోజులివి. ఒకప్పుడు రాజకీయ నాయకులు మాత్రమే ‘అధికారం’ అనే అహాన్ని ప్రదర్శించేవారు… కానీ, సిఎం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి చూపిన చొరవను బహుశా ఆదర్శంగా తీసుకున్నారో ఏమో గానీ, వర్తమాన రాజకీయాల్లో వారసుల ‘ప్రభావం’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటోంది.
దీనికి ప్రస్తుత రాజకీయ నాయకుల సుపుత్రులు చేస్తున్న ‘ఘనకార్యాలను’ నిత్యం వార్తలో చూస్తూనే ఉన్నాం. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ చేసిన ‘అద్భుతం’ సీసీ కెమెరాల సాక్షిగా వెలుగు చూసిన వైనం తెలిసిందే. ఓ ముస్లిం మహిళను చేయి పట్టుకుని కారులోకి లాగబోయాడని స్వయానా సదరు మహిళ కేసు పెట్టింది. అయితే తాజాగా ఇదే కేసులో అసలు రావెల కిషోర్ అంటే ఎవరో తనకు తెలియదని ఆ మహిళే సమాధానం చెప్పడంతో… కేసునూ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదంతా వింటే… సినిమాలలోని పలు సన్నివేశాలు గుర్తుకు రావడం సహజమే. సరైన సాక్ష్యాలను మాత్రమే పరిగణించే కోర్టులు చెప్పే తీర్పులలో తప్పు ఉండదు. కానీ, చట్టాలలో ఉన్న లొసుగులను అధికార పలుకుబడితో, రాజకీయ అండతో సాక్ష్యులపై ప్రభావితం చేయడం అనేది తెరవెనుక జరిగే అసలు విషయం. నాయనో, భయానో తమకు కావాల్సింది సాధించుకోవడమే నేటి పొలిటికల్ లీడర్స్ ట్రెండ్. వర్తమాన రాజకీయాలను ప్రస్తుతం ఇందుకోసమే రాజకీయ నాయకులు వినియోగించుకుంటున్నారని తాజా ఉదంతం మరోసారి నిరూపించిందని ప్రజల భావాలు.
ఇన్ని సౌలభ్యాలు రాజకీయాల్లో ఉన్నాయి గనుకనే… ఇటీవల కాలంలో ఏ ప్రముఖ వ్యక్తిని గాని, ఏ సినీ సెలబ్రిటీని గాని కదిపినా… చివరికి వారి పయనం రాజకీయ రంగం వైపుకే మళ్ళుతోంది. బహుశా అందుకే రాజకీయాల్లో చేరుతున్నరేమో అని చెప్పక తప్పదు. ఎవరో ఒకరిద్దరు ఇందుకు మినహాయింపు గానీ, ప్రస్తుతం రాజకీయం సాధించలేనిది ఏమీ లేదు కదా…!



