ఆర్జీవికి హైకోర్ట్ అక్షింతలు!

high court warns rgvఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా వర్గాల్లో ప్రధాన వ్యక్తిగా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మకు బాంబే హైకోర్ట్ అక్షింతలు వేసింది. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న “సర్కార్ 3” స్క్రిప్ట్ కు సంబంధించిన ఈ వివాదంలో రచయిత నీలేష్ గిర్కర్ దాఖలు చేసిన పిటిషన్ లో వర్మ కడుపు నిండేలా హైకోర్ట్ మండిపడింది. 2012లో తాను రాసిన ఈ స్క్రిప్ట్ కు తగిన విధంగా పారితోషికం ఇస్తాననే ఒప్పందంతో వర్మ తీసుకున్నారని, కానీ దానిని ఉల్లంఘించడంతో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని గిర్కర్ తెలిపారు.

ADVERTISEMENT

దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్ట్, టైటిల్ కార్డ్స్ లో ‘బేస్డ్ ఆన్ ఎ స్టోరీ వ్రిటేన్ బై నీలేష్ గిర్కర్’ అని తప్పనిసరిగా వేయాలని, శాటిలైట్, డిజిటల్ మరియు సినీ ప్రింట్ లలో తప్పనిసరిగా ఉండాలని రాంగోపాల్ వర్మకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ స్క్రిప్ట్ రాసినందుకు గానూ, పారితోషికం క్రింద 6.20 లక్షల రూపాయలు గిర్కర్ ఖాతాలో వర్మ డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ‘సర్కార్ 3’ రచయితగా అన్ని రూపాలలో నీలేష్ గిర్కర్ కు ఇవ్వాల్సిన క్రెడిట్ తగిన విధంగా ఇవ్వాలని తెలిపింది.

మరో మూడు రోజుల్లో సినిమా విడుదల తేదీ ఉండడంతో బాంబే హైకోర్ట్ ఆదేశాలను వర్మ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేని పక్షంలో సినిమా విడుదలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరికి జలక్ ఇచ్చే వర్మకు సదరు రచయిత హైకోర్ట్ ద్వారా జలక్ ఇవ్వడం విశేషం. అయితే డబ్బులు చెల్లించకుండా, టైటిల్ కార్డ్స్ లో పేరు వేయకుండా నీలేష్ స్క్రిప్ట్ ను వర్మ ఎలా తీసుకున్నారు? అంటే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ చాలా సర్వసాధారణమే అన్న మాట వినపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories