సోషల్ మీడియా జమానా నడుస్తున్న ప్రస్తుత సమాజంలో సామాన్యుడి నుండి సెలబ్రెటీ వరకు రైతుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరు వారి వారి స్థాయికి, అవసరానికి తగ్గట్టుగా ఒకరకంగా చెప్పాలంటే అవసరానికి మించే సోషల్ మీడియాను వాడుతున్నారు, అలాగే టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
అయితే ఎక్కువగా సమాజన్ని ప్రభావితం చేసే రెండు రంగాలల ఒకటి సినిమా అయితే రెండు రాజకీయం. ఈ రెండు రంగాలలోను పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా వాడుకోవడం తో పాటుగా తమ అపోనియంట్ కి ప్రతికూలంగా మలుస్తున్నారు కొంతమంది మేధావులు.
ఇందుకు గాను రాజకీయాలకు ఐప్యాక్ టీం లు పనిచేస్తుంటే, సినీ రంగానికి పిఆర్ టీం లు కృషి చేస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ ప్రజలను తమ వైపు, తమ పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు ఇతర పార్టీల ను ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థి ని ద్వేషించేందుకు గాను రాజకీయాలకు ఈ ఐప్యాక్ టెక్నాలిజీని తీసుకొచ్చారు.
అయితే ఈ ఐ ప్యాక్ రాజకీయం అనేది చాల ఖర్చుతో కూడుకున్నది. సోషల్ మీడియాలో వేలాదిమందితో నడిచే ఒక వ్యవస్థను సిద్ధం చెయ్యాలి. ఎప్పటికప్పుడు తమ క్లయింట్ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోస్టులు విస్తృత స్థాయిలో ప్రచారంలో ఉంచాలి. అయితే ఇదంతా కూడా ఒక ఫేక్ మాస్క్ వేస్తూ చేసే కార్యాలే.
అలాగే తమ ప్రచారాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాయి ఈ ఐప్యాక్ టీంలు. ఇందుకు 2019 – 2024 వరకు ఏపీలో వైసీపీ చేసిన రాజకీయమే ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రిగా జగన్ రాకతో ఏపీకి వందల మంది ప్రభుత్వ సలహాదారులు పరిచయమవ్వగా వేలాదిగా ఐప్యాక్ సిబ్బంది పుట్టుకొచ్చారు.
వీరి పనల్లా వైసీపీ నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకోవడం, సోషల్ మీడియాలో వైసీపీ కి అనుకూలంగా జగన్ కు మద్దతుగా పోస్టులు పెట్టడం. అలాగే టీడీపీ – జనసేన ల రాజకీయ బంధాన్ని దెబ్బ తీసేలా ఫేక్ ప్రచారాలు చేయడం, ఇక ఆయా పార్టీల నాయకుల మీద అసత్యపు వార్తలు సృష్టించి వాటిని ప్రజలు నమ్మేలా చేయడం.
ఇక సినీరంగాన్ని విషయానికొస్తే, ఇక్కడ ఆఫ్ కెమెరా లో రాజకీయ రంగానికి మించిన రాజకీయం నడుస్తుంది అనేలా బాహాటంగానే ఈ పిఆర్ టీంల భాగోతం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు తాజాగా మిత్రమండలి మూవీ ప్రమోషన్ లో భాగంగా పిఆర్ టీంల పై బన్నీ వాసు చేసిన హాట్ కామెంట్స్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
పిఆర్ టీంలు పెట్టుకుని తన పై పెయిడ్ ట్రోలింగ్ చేస్తున్నారని, అలాగే తమ సినిమా పై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు కుట్ర జరుగుతుందని సభా వేదిక సాక్షిగా తన అసహనాన్ని వ్యక్తం చేసారు బన్నివాసు. అయితే ఈ పిఆర్ టీంల రచ్చ ఈ నాటిది కాదు గత కొంతకాలంగా ఈ పిఆర్ టీంల వ్యవస్థ యావత్ సినీరంగాన్ని పట్టి పీడిస్తుంది.
తమకు నచ్చని హీరో లేదా దర్శకుడు లేక నిర్మాత, హీరోహిన్ ఇలా ఎవరైనా తనకు నచ్చని వ్యక్తి సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఎదురు డబ్బులు పెట్టుకుని మరి ఆ మూవీ పై నెగటివ్ ఇంపాక్ట్ పడేలా తెర వెనుక పనిచేసేలా కొంతమంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇక్కడ ఆరోపణ.
ఇందుకు టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధభావమేదీ ఉండదు. ఉదాహరణకు తెలుగు హీరోహిన్ సాయిపల్లవి కి బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం లో సీత పాత్రకు అవకాశం రావడంతో అక్కడి కొంతంది బాలీవుడ్ నటీమణుల పిఆర్ టీంలు పనికట్టుకుని మరి సాయిపల్లవి ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పై ట్రోల్ల్స్ చేస్తున్నారంటూ,
అలాగే ఆమెకు వ్యతిరేకంగా పల్లవి ఇమేజ్ డామేజ్ అయ్యేలా ఫేక్ ప్రచారాలు నడిపిస్తున్నారు అంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారమయ్యాయి. ఇదంతా కూడా తమకు దక్కని అవకాశం సాయి పల్లవికి దక్కిందనే అక్కసు, అసూయే కారణం అనేది పల్లవి అభిమానుల అభిప్రాయం.
ఇక సందీప్ వంగా, ప్రభాస్ స్పిరిట్ సైతం ఒక బాలీవుడ్ స్టార్ హీరోహిన్ పిఆర్ టీం చేతుల్లోకి వెళ్లిందని ఇందుకు ఆ పిఆర్ టీం ను ఉద్దేశిస్తూ వారికి కౌంటర్ గా వంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇలా సినీరంగాన్ని ఒక పక్కన పైరసి భూతం వెంటాడుతుంటే మరోపక్క ఫ్యాన్ వార్లు, ఈ పిఆర్ టీంలు ఇండస్ట్రీని జలగల్లా పట్టిపీడిస్తున్నాయి.
అయితే ఏది ఏమైనా ఎన్ని ఐపాక్ టీంలు పనిచేసినా ప్రజల మద్దతు లేకుండా ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురాలేవు, అలాగే ఒక నాయకుడిని ముఖ్యమంత్రిని చెయ్యలేవు అనేది 2024 ఎన్నికల ఫలితాలను చూస్తే అర్ధమవుతుంది.
ఇక ఇక్కడ ఎంతమంది పిఆర్ టీం లు కష్టపడ్డా సినిమాలో దమ్ముంటే దాన్ని ప్రేక్షకుడికి చేరకుండా అడ్డుకోలేదు, అలాగే మూవీ లో విషయం లేకుంటే దాన్నీ ప్రేక్షకుడి పై రుద్దనులేమనేది తెలుసుకోవాలి. ఒకవేళ రుద్దినా కాకరకాయ క్యారెట్ కాలేదుగా అనేది గ్రహించాలి.! ఐప్యాక్ అయినా పిఆర్ అయినా చివరికి ఒక నిరుద్యోగికి ఉపాధి కలిగించే ఒక సాధనం మాత్రమే అనేది గుర్తించాలి.




