2018 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. అందులో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే తెరాసలో చేరిపోగా… ఇంకో ఎమ్మెల్యే నిన్న చేరిపోయారు. ఆ తరువాత ఇద్దరు కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విలీనం లేఖ అందచేశారు. ఆ తర్వాత వారికి ముఖ్యమంత్రి కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు.
ఈ వార్త సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు సాక్షికి అమితానందం కలిగించింది. తెలంగాణలో తెలుగుదేశం పరిపూర్ణంగా జీరోకి వచ్చినట్లు ఉంది అంటూ వార్తలు వడ్డించారు. తెరాసలో తెలంగాణ టీడీపీ విలీనమైంది, టీడీఎల్ఫీని మూసేశారు… నెక్స్ట్ ఏపీ వంతు అంటూ విజయసాయి రెడ్డి వంటి వారు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో చూపించుకున్నారు.
“2014లో రాష్ట్ర విభజన తరువాత నేటి వరకు టీడీపీ తెలంగాణలో ఉంది. పోయిన ఎన్నికలలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అదే సమయంలో 2018 ఎన్నికలలో కనీసం పోటీ చెయ్యలేకపోయింది వైఎస్సార్ కాంగ్రెస్. ఆ పార్టీని 2014-15 మధ్యలోనే తెరాస విలీనం చేసేసుకుంది. అటువంటిది వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీని ఎద్దేవా చెయ్యడమేంటి?,” అని టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు.
“కేసీఆర్ కు భయపడి వైఎస్సార్ కాంగ్రెస్ దుకాణం సర్దేశారు. చెల్లలు కావాలంటే కనీసం ఇవ్వలేకపోయారు. 2004 తరువాత అసలు తెలంగాణలో అధికారం చూడకపోయినా ఎంతోకొంత నిలబడిన పార్టీ టీడీపీ. అసలు ఏ మొహం పెట్టుకుని టీడీపీని వైఎస్సార్ కాంగ్రెస్ వారు విమర్శించాలనుకుంటున్నారో మరి,” అని వారు ఎద్దేవా చేస్తున్నారు.





