దేశంలో మరోకొత్త భాష గా ‘రాజకీయ’ భాష…?

Political language debate in India

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా ఉన్న భారదేశం భిన్న జాతుల, మతాల, భాషల సమూహం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, ఉర్దూ అంటూ ఇలా దేశంలో ఎన్నో రకాల భాషలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరి ప్రాంతానికి తగ్గట్టుగా, ఎవరి అభిరుచి నచ్చినట్టుగా వారు ఆ భాషలను వినియోగిస్తుంటారు.

అయితే తాజాగా భారతదేశంలో మరో కొత్త భాష పురుడుపోసుకోబోతుంది. అదే రాజకీయ భాష. ఇన్నాళ్లు రాజకీయ పార్టీల నేతలు, వారి మద్దతుదారులు కూడా వారి ప్రాంతానికి తగ్గట్టు, అక్కడి మాండలికాలకు అనువుగా ప్రజాస్వామ్యబద్ధమైన భాషను ఉపయోగించేవారు.

ADVERTISEMENT

ప్రత్యర్థి పార్టీల నేతలను విమర్శించాలన్నా, ఆ పార్టీ విధివిధానాలను ఎండగట్టాలన్నా, విమర్శకు ప్రతి విమర్శ చెయ్యాలన్నా అందుకు ఒక గౌరవపూర్వకమైన భాషను ప్రయోగించేవారు. అధికార – ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకే ఆ తరువాత రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అభివృద్దే ముఖ్యం అన్నట్టుగా రాజకీయాలు నడిచేవి.

కానీ ఇప్పుడు రాజకీయాలకు అర్ధాన్ని మార్చేస్తున్నారు రాజకీయ నాయకులు, పార్టీల అధినేతలు. నేడు నిరంతరం అధికార – ప్రతిపక్షాల మధ్య ఎన్నికల కోసం జరిగే రాజకీయ యుద్దాన్ని మించి యుద్ధం జరుగుతుంది. ఇక నేతల విమర్శలు ప్రతి విమర్శలకు కూడా సెన్సార్ ఉండాలేమో అన్న స్థాయిలో రాజకీయ నాయకుల భాష దిగజారిపోతోంది.

రాజకీయ విమర్శల స్థానంలోకి వ్యక్తిగత విమర్శలు వచ్చి చేరాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయాల్సిన పోరాటాలు రాజకీయ పార్టీల రాజకీయ లబ్ది కోసం, వ్యక్తిగత ప్రయోజనాల సాగుతున్నాయి. ఇక సీఎం, పలానా మంత్రి అంటూ సంధించాల్సిన ప్రశ్నలు సన్నాసి, దద్దమ్మ, దత్త పుత్రుడు, గుంపు మేస్త్రి అంటూ మొదలై ఇక లకారాల వరకు వెళ్లిపోతున్నాయి.

అలాగే రాజకీయాలకు సంబంధం లేని మహిళలను, వారి కుటుంబ సభ్యులను కూడా రాజకీయ వేదికల మీదకెక్కిస్తూ వారి వ్యక్తిత్వ హననానికి వెనుకాడడం లేదు. ఇందుకు భీజం వేసింది మాత్రం వైసీపీ పార్టీ అనే చెప్పాలి. అలాగే ఈ రాజకీయ భాషను పెంచి పోషించింది కూడా వైసీపీ నేతలే. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఏకంగా బూతు మంత్రిగా ప్రచారం పొందారు అంటే ఈ రాజకీయ నాయకుల భాష ఏస్థాయికి పతనం అయ్యింది అర్ధమవుతుంది.

అయితే ఇప్పుడు ఆ వైరస్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ పార్టీల నేతలను, వారి క్యాడర్ ను సోకింది. తాజాగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ – ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మొదలైన సవాళ్లు – ప్రతిసవాళ్ళ రాజకీయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగారు.

చర్చకు రమ్మని పారిపోతున్న దద్దములు, చేతకాని సన్నాసులు కాంగ్రెస్ మంత్రులని, పోలీసులను ఉసిగొల్పి మా పార్టీ నేతలను అరెస్టులు చేయిస్తున్న ఆ సన్నాసి ఎవడు.? ముఖ్యమంత్రా.? హోమ్ మంత్రా.? అంటూ సీఎం రేవంత్ టార్గెట్ గా దిగజారుడు పదజాలాన్ని ప్రయోగించారు.

అయితే సీఎం పదవి అనేది ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ బద్ద పదవి, కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఇలా విపక్ష పార్టీల అధినేతలు విచక్షణ మరిచి మాట్లాడుతుంటే ఇక పార్టీ కార్యకర్త సంగతేంటి.? మొన్న ఏపీలో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.

ప్రజలకు ఆదర్శంగా, సమాజానికి మేలు చెయ్యాల్సిన రాజకీయ నేతలే ఇలా విలువలు గాలికొదిలి వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే, బూతు పదాలను ప్రయోగిస్తుంటే వారి కోసం రాజ్యంగంలో రాజకీయ నాయకుల భాషకు ‘రాజకీయ భాష’ అనే మరోకొత్త భాషను చేర్చాల్సిన అవసరం ఏర్పడుతుందేమో, అలాగే వారి భాషకు కూడా డిక్షనరీ లో కొత్త అర్ధాలను వెతకలేమో…!

ADVERTISEMENT
Latest Stories