సినిమాలకు, రాజకీయాలకు హైప్ అవసరమే కానీ…

Hype vs reality in politics and cinema

సినిమాలలోనైనా, రాజకీయాలలోనైనా అనవసరంగా ‘హైప్’ సృష్టించుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2024 ఎన్నికలలో వైసీపీ 175/175 సీట్లు గెలుచుకొని, మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్‌ బల్ల గుద్ది వాదించేవారు. అంత హైప్ సృష్టించుకున్నప్పుడు ప్రజల నమ్మకం కూడా ఆ స్థాయిలోనే ఉందా లేదా? ఉందని నిర్దారించుకోవడం చాలా ముఖ్యం. కానీ నా అభిప్రాయమే జనాభిప్రాయమని అనుకున్నారు. కాదని తేలింది.

ADVERTISEMENT

మరో ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి కేసీఆర్‌ జమానాలో ఎంతగా హైప్ క్రియేట్ చేశారో, తర్వాత ఏం జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ నాడు సృష్టించుకున్న ఆ హైప్ వలన ఇప్పుడు ప్రతీ సమస్య భూతద్దంలో నుంచి చూస్తున్నట్లు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. చాలా దశాబ్దాల క్రితమే దేశంలో కాళేశ్వరం కంటే చాలా పెద్ద ప్రాజెక్టులు అనేకం నిర్మించారు. కానీ వాటి నిర్మాతలు వాటికి హైప్ సృష్టించుకొని రాజకీయంగా లబ్ది పొందాలని ఆరాతపడలేదు. కనుక వాటిలో చిన్నా పెద్ద సమస్యలు ఏర్పడినా వాటిని ప్రజలు భూతద్దంలో నుంచి చూడటం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక మంది హేమాహేమీలు హైప్ వల్లనే ఎదురుదెబ్బలు తిన్నారు. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకొని వాస్తవ పరిస్థితులను వాస్తవ దృక్పదంతో చూసి ముందుకు సాగి విజయం సాధించినవారు కూడా మన కళ్ళ ముందే ఉన్నారు.

రాజకీయాలతో పోలిస్తే సినీ పరిశ్రమలో ఈ ‘హైప్ వ్యాధి’ ఇంకా తీవ్రంగా ఉంటుంది. కనుక వందల కోట్లు పెడితే హైప్ క్రియేట్ చేయడం తప్పనిసరి అయిపొయింది.

కానీ కోటి రూపాయలలోపు బడ్జెట్‌తో తీసిన అనేక చిన్న సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా సూపర్ హిట్ అవుతుంటాయి. కంటెంట్ బాగుంటే సినిమా చిన్నదా పెద్దదా? తెలుగా, కన్నడా లేక మరాఠీ సినిమానా అని చూడకుండా ప్రేక్షకులు హిట్ చేస్తుంటారు… అని తెలిసి ఉన్నా భారీ బడ్జెట్‌, మూస కథలతో సినిమాలు తీస్తూనే ఉన్నారు. వాటికి హైప్ క్రియేట్ చేసి బోర్లా పడుతూనే ఉన్నారు. పైగా అస్థికలు గంగలోనో గోదార్లో కలిపినట్లు వాటికి సక్సస్ మీట్ పేరుతో అంత్యక్రియలు కూడా ఘనంగా చేసుకొని సంతోష పడుతున్నారు.

ఇటీవల విడుదలవుతున్న బారీ బడ్జెట్‌ సినిమాలలో చాలా వరకు ఈ ‘హైప్ బాధిత సినిమాలు’గా మారి నెగెటివ్ టాక్ సంపాదించుకుంటున్నాయి. సినిమా సక్సస్ కొరకు హైప్ చాలా అవసరమే కానీ అది ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావచ్చు.. కానీ సినిమా నిలబెట్టేది కంటెంట్ మాత్రమే.

అదేవిధంగా రాజకీయాల్లోనూ ఎంతైనా హైప్ సృష్టించుకోవచ్చు. కానీ ప్రజలు నమ్ముతున్నారా లేదా? అని తెలుసుకోవడం అంతే ముఖ్యం. అప్పుడే సినిమాలైనా, రాజకీయాలైనా హిట్ అవుతాయి.

ADVERTISEMENT
Latest Stories