అమరావతి గ్రాఫిక్స్ అయితే.. జగన్ గణాంకాలు ఏమిటో?

YSR Congress Not Even Sparing Gods!ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన అమరావతిని ‘భ్రమారావతి’, ‘కమ్మరావతి’ అంటూ మాజీ మంత్రి కొడాలి నాని నిన్న శాసనసభలో ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతి గ్రాఫిక్స్ చూపి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు నిర్మించిన శాసనసభలోనే కూర్చోన్నామని, ఆయన కట్టించిన సచివాలయం నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నామనే ఇంగితం లేకుండా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అధినేత జగన్‌ మెప్పు కోసం ఇంకా చాలా అనుచితమైన మాటలే సభలో మాట్లాడారు. పోటీలు పడి చంద్రబాబు నాయుడుని టిడిపిని విమర్శించారు… జగన్ భజన చేశారు.

చంద్రబాబు నాయుడు అమరావతిని పూర్తిచేయలేకపోయిన అక్కడ ఆయన కట్టించిన కట్టడాలు కనిపిస్తున్నాయి. వేలకోట్ల రూపాయల ఖర్చు చేసి నిర్మించిన వాటినన్నిటినీ కేవలం ఆయనపై కక్షతోనే వైసీపీ ప్రభుత్వం పాడుబెడుతోంది కూడా. అది వేరే విషయం. కానీ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషికి అవన్నీ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వాటిని జగన్ ప్రభుత్వం యదాతధంగా పూర్తిచేయగలిగి ఉంటే ఆ గ్రాఫిక్స్‌ నిజమయ్యి కళ్ళ ఎదుట అద్భుతమైన రాజధాని సాక్షాత్కరించి ఉండేది.

ADVERTISEMENT

కానీ మూడేళ్ళుగా రాజధాని నిర్మాణాలు నిలిపివేసి, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా సంక్షేమ పధకాల కోసం అప్పులు చేస్తూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించేసింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు, కాగ్ నివేదికలు, బిజెపి, టిడిపి, ప్రతిపక్షాలన్నీ ఇదే చెపుతున్నాయి కదా?

కానీ కళ్లెదుట కనిపిస్తున్న అమరావతిని కొడాలి నాని వాచలతతో భ్రమరావతి అని వర్ణిస్తే, సిఎం జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బేషుగ్గా ఉంది… ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్ర జీడీపీ చాలా అద్భుతంగా ఉందంటూ కాకి లెక్కలు చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ గంతలు కట్టే ప్రయత్నం చేశారు. ఏపీ అభివృద్ధిని, సంక్షేమ పధకాలను చంద్రబాబు నాయుడు అండ్ కో అడ్డుకొంటున్నారని ఆరోపించారు.

సిఎం జగన్ చెప్పినట్లు ఏపీ ఆర్ధిక పరిస్థితి, జీడీపీ బాగానే ఉంటే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు ఎందుకు చెల్లించలేకపోతోంది? ఉద్యోగుల దాచుకొన్న సొమ్మును ఎందుకు తీసుకొంది? పోలవరం నిర్వాసితులకి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోట్లు ప్రింట్ చేసే యంత్రాలు లేవని జగన్ ఎందుకు అన్నారు? ప్రతీనెల వేలకోట్లు అప్పులు తెస్తేగానీ ప్రభుత్వం నడవని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కార్పొరేషన్లను అడ్డుపెట్టుకొని అప్పులు ఎందుకు చేయవలసిస్తోంది?రాష్ట్రానికి అప్పులు ఈయవద్దని కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంకుని ఎందుకు హెచ్చరించింది? రాష్ట్రంలో రోడ్లు గోతులు పడి చెరువులను తలపిస్తుంటే మరమత్తులు ఎందుకు చేయించడం లేదు?పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఎందుకు వాడేసుకొంటోంది?కాంట్రాక్టర్లకి బిల్లులు ఎందుకు చెల్లించలేకపోతోంది. చివరికి జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ బిల్లులు ఎందుకు చెల్లించలేకపోతోంది? ఇలా… అనేక ప్రశ్నలకు వైసీపీ వద్ద సమాధానాలే ఉండవు.

తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏళ్ళలో అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, లక్షల కోట్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు వచ్చినా ఆ రాష్ట్రం కటకటలాడిపోతోంది. కానీ ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా ఎడాపెడా లక్షల కోట్లు అప్పులు చేస్తూ మూడేళ్ళలో రాష్ట్రాభివృద్ధి కోసం ఏమీ చేయకపోయినా మన ఆర్ధిక పరిస్థితి దివ్యంగా ఉంది… జీడీపీ కూడా చాలా వృద్ధి చెందిందని సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతున్నారు. ఎలా సాధ్యం?

ADVERTISEMENT
Latest Stories