ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో రాష్ట్ర హోంమంత్రి అనిత వంగలపూడిని ఉద్దేశ్యించి చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారాయని చెప్పవచ్చు. “రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి మీరు ఏం చేస్తున్నారు?
నేను అటవీ, పంచాయితీరాజ్ శాఖల మంత్రిని స్పందిస్తుంటే మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటివాటికి బాధ్యత వహించరా?రా హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
మీకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?నిందితులపై చర్యలు తీసుకోరా?వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులకు ఏంటి ఇబ్బంది?మేము ఇంకా ఎన్నిసార్లు మీకు చెప్పాలి?
మీరు ఇలాగే బాధ్యత వహించకుండా ఉండిపోతే నేను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవలసివస్తుంది. నేను హోంమంత్రినైతే అప్పుడు పరిస్థితులు ఈవిదంగా ఉండవని గ్రహించాలి.
ఇంతకాలం మా గురించి ఎవరేమంటున్నా పట్టించుకోలేదు. కానీ మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. భావప్రకటన స్వేచ్చపేరుతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన్నట్లు పోస్టులు పెడుతున్నారు.
మాది ప్రతీకార ప్రభుత్వం కాదని ముందే చెప్పాను. కానీ మాది చాటకాని ప్రభుత్వం కాదు. మీరు (వైసీపి) ఇంకా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకొను. నాకు ఓపిక అయిపోయింది. తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను,” అని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ హోంమంత్రిని ఉద్దేశ్యించి ఈవిదంగా వ్యాఖ్యలు చేయడం, అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు చేపడుతానని హెచ్చరించడం, రెండూ కూడా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరమైనవే.
పవన్ కళ్యాణ్ హోంమంత్రిని అనిత వంగలపూడిని ఉద్దేశ్యించి ఈ విమర్శలు చేసిన్నట్లున్నా, హత్యలు, అత్యాచారాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పిన్నట్లే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెతక వైఖరిని తప్పు పడుతున్నట్లే ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు, వైసీపికి బలమైన ఆయుధం అందించాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఇంతకాలం తాము మొత్తుకొంటున్నా సిఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని, ఇప్పుడు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెపుతున్నారని వైసీపి చెప్పుకోకుండా ఉండదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయకుండా ఉండదు.
వైసీపితో ఏర్పడే ఈ ఇబ్బంది కంటే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో కూటమిలో చిచ్చు రగిలినట్లయింది. దానిని చల్లార్చుకోవడమే సిఎం చంద్రబాబు నాయుడు తక్షణ కర్తవ్యం.
ఇదే… మరో మంత్రి ఈవిదంగా మాట్లాడి ఉండి ఉంటే సిఎం చంద్రబాబు నాయుడు ఏవిదంగా స్పందించేవారో ఊహించుకోవవచ్చు. కానీ టిడిపికి మిత్రపక్షంగా, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్‌పై ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకోలేరు.
పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లు అనిత వంగలపూడిని తప్పించేసి ఆ పదవిని పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సివస్తే దాంతో ఊహించని కొత్త ఇబ్బందులు పుట్టుకువస్తాయి.
కనుక సున్నితమైన ఈ సమస్యని సిఎం చంద్రబాబు నాయుడు సున్నితంగానే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు అంత తేలికగా కొట్టిపడేయలేము. ఆయన ఆగ్రహం, అసంతృప్తి ఏ మార్పులకి దారి తీస్తుందో?




