నేటికీ ఐటి సేవల కోసం అమెరికా భారత్ మీద ఆధారపడుతోంది. ఇది భారత్‌కు చాలా బలమైన, సానుకూల అంశమే కదా?ఒకవేళ ట్రంప్ దెబ్బకు భారత్ ఐటి సేవలు నిలిచిపోతే అమెరికాయే అతలాకుతలం అవుతుంది. కానీ ట్రంప్ కన్నెర్ర చేయగానే భారతీయ కంపెనీలన్నీ గజగజ వణికిపోతున్నాయి!
ఎందుకంటే అవి తాము అమెరికా మీద ఆధారపడి ఉన్నామని గట్టిగా విశ్వసిస్తునందునే. అది వాస్తవమే కావచ్చు. కానీ అమెరికా కూడా తమపై ఆధారపడి ఉందని మరిచిపోకూడదు.
మరో విషయం ఏమిటంటే, ట్రంప్ కన్నెర్ర చేసిన తర్వాతే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు విశాఖలో వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నాయి. భారత్ నుంచే అమెరికాతో సహా ప్రపంచ దేశాలకు ఐటి సేవలు అందించాలనుకుంటున్నాయి. అంటే అర్ధం ఏమిటి? భారత్ మార్కెట్ చాలా విస్త్రుతమైనది… బలమైనదని అని అవి నమ్మబట్టే కదా?అమెరికా కంపెనీలే భారత్ తరలివస్తున్నప్పుడు అమెరికా మీద అతిగా ఆధారపడటం దేనికి?
దేశంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్‌గావ్ వంటి పలు నగరాలలో గల వందలు, వేల ఐటి కంపెనీలే లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ, వారు ఉన్నతంగా జీవించేందుకు దోహదపడుతున్నాయి కదా?మరి అమెరికా మోజు దేనికి?
ఎప్పుడో అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడినవారిని తప్పు పట్టలేము. కానీ నేటికీ అమెరికా అమెరికా అంటూ కలవరించడం దేనికి? వెళ్ళి ట్రంప్ చీదరింపులు, అవమానాలు భరించడం దేనికి?వారి తుపాకులకు బలవడం అవసరమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయుల ఆలోచన ధోరణిలో ఇటువంటి మార్పు వస్తే అప్పుడు ట్రంపే మన చుట్టూ తిరుగుతారు.




