పాకిస్తాన్ చిరకాలంగా భారత్ నుంచి కాశ్మీర్‌ని విడగొట్టి సొంతం చేసుకునేందుకు చేయకూడని పనులన్నీ చేస్తూనే ఉంది. మరోపక్క తన అధీనంలో ఉన్న కాశ్మీర్‌లో, బలూచిస్తాన్‌లో వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచివేస్తూనే ఉంది.
వేర్పాటువాదులతో ఏ దేశమైనా ఇదే విధంగా వ్యవహరిస్తుంది కనుక పాకిస్తాన్ చర్యలను, దాని కుట్రలను ధీటుగా ఎదుర్కొంటున్న భారత్‌ని తప్పు పట్టలేము.
అయితే భారత్-ఆఫ్ఘనిస్తాన్ మద్య ఏర్పడిన కొత్త స్నేహం భారత్ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పర దాడులు చేసుకున్నారు. తాజా దాడిలో 58 మంది పాకిస్తానీ సైనికులు హతం అయ్యారు.
పాకిస్తాన్ ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ వారిని తమ దేశంలోకి ప్రవేశపెట్టేందుకు కుట్రలు చేస్తోందని తాలీబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు. ఇటీవల కాబూల్ నగరంలో జరిగిన బాంబు దాడి వెనుక పాక్-ఉగ్రవాదుల హస్తం ఉందని తేలిందని అందుకే పాక్‌పై తమ దళాలు ప్రతీకార దాడులు చేశాయన్నారు. ఇప్పటికైనా పాక్ తీరు మారకుంటే మరింత తీవ్రంగా స్పందిస్తామని జబీహుల్లా ముజాహిద్ హెచ్చరించారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ అందిస్తూ ఉగ్రవాదులను తయారు చేస్తుంటే, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తాలిబన్ ఉగ్రవాదులే నడుపుతున్నారు.
అటువంటి తాలిబన్ ప్రభుత్వంతో భారత్ స్నేహం చేస్తుండటం, తాలిబన్ మంత్రిని ఢిల్లీకి ఆహ్వానించడం, ఆయనతో కలిసి మన విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియా సమావేశం నిర్వహించడం వంటివన్నీ ప్రపంచదేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్‌కు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి.
తమ దేశంపై ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న దాడుల వెనుక భారత్ ప్రోద్బలం, సహాయ సహకారాలు ఉన్నాయని పాకిస్తాన్ ఆరోపించాకుండా ఉండదు. ఇప్పటికే బలూచిస్తాన్ వేర్పాటువాదులకు భారత్ తెరచాటున సహాయ సహకారాలు అందిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తూనే ఉంది.
ఇప్పుడు ఢిల్లీలో తాలిబన్ మంత్రి ప్రత్యక్షమవడంతో ప్రపంచ దేశాలు కూడా పాక్ ఆరోపణలు నమ్మకుండా ఉంటాయా?కనుక ఇకపై పాక్‌పై ఆఫ్ఘనిస్తాన్ చేసే ప్రతీ దాడి భారత్ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. ఆ దాడులన్నీ భారత్ పద్దులోనే జమా అయినా ఆశ్చర్యపోనక్కర లేదు.







