“యూ ట్యూబ్ ఛానల్స్”పై ఇంటిలిజెన్స్ హెచ్చరికలు!

 intelligence warns on youtube channels
యూ ట్యూబ్ ఛానల్స్ ముసుగులో సంఘవిద్రోహ శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మీడియా ముసుగులో విధ్వంసం సృష్టించేందుకు ఆ శక్తులు సిద్ధమవుతున్నట్టు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించేందుకు పెద్దగా శ్రమ లేకపోవడం, ప్రభుత్వ లైసెన్స్‌ లు తదితర వాటితో పని లేకపోవడంతో ఎవరైనా సరే, కేవలం అయిదే అయిదు నిమిషాల్లో యూ ట్యూబ్ చానళ్లను ప్రారంభించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

దీంతో చాలా మంది వినియోగదారులు యూ ట్యూబ్‌ లో సొంతంగా న్యూస్ ఛానల్స్ ను పెట్టుకుని రిపోర్టర్లుగా చలామణి అవుతున్నారు. మీడియాతో సంబంధాలు లేని వారు సైతం ఇలా చేయడం వల్ల ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా, భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. డబ్బుకు ఆశపడి వీరు సంఘ విద్రోహ శక్తులకు అమ్మడుపోతే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందని, కీలకమైన స్థావరాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని వీరిని ఉపయోగించుకుని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. యూ ట్యూబ్ ఛానల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాపులర్ చానళ్ల జోలికి పోకుండా ఏదో ఒక లోగోతో తిరుగుతున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అక్రెడిటేషన్ జర్నలిస్టుల విషయంలో కాకుండా మిగతా వారి విషయంలో జాగురూకతతో వ్యవహరించాలని, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాలని సూచించింది. వారిలో ఎవరికైనా నేర చరిత్ర ఉన్నా, యూ ట్యూబ్ చానల్ పేరుతో లోగోలు పట్టుకుని కనిపించినా ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేసింది.

ADVERTISEMENT
Latest Stories