విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సదస్సు వేదికగా ఏపీలో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో 1.95 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు కుదరగా, రెండవ రోజు అంతకు మించిన మొత్తంలో పెట్టుబడులు తరలి రావడం విశేషం. 282 ఒప్పందాలకు గానూ దాదాపు 2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీలో కొలువు తీరనుండగా, దాదాపు 8 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర యువతకు వరం కానున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే రికార్డు స్థాయి పెట్టుబడులకు ఏపీ నిలయంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల హైలైట్స్…
ఐటీ రంగంలోనూ 55 ఎంవోయూలకు గానూ 3,168 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. విశాఖ నగరంలో రూ.100 కోట్లతో ఐటీ కంపెనీ పెట్టేందుకు టెక్ విజెన్ కంపెనీ ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విస్తరించేందుకు 38,500 కోట్ల భారీ పెట్టుబడులకు సంస్థ యాజమాన్యం రాష్ట్రీయ ఇస్పాత నిగం లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ముందుకొచ్చింది. శ్రీసిటీ సెజ్‌లో కోల్గేట్ పామోలివ్ కంపెనీ 450 కోట్లు, ఇసుజు 230 కోట్లు, విక్రం సోలార్ 220 కోట్లు, థర్మాక్స్ 200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. తిరుపతిలో రూ.100 కోట్ల పెట్టుబడితో మొబైల్ చార్జర్లు, సెట్‌టాప్ బాక్స్‌ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆక్సైమ్ ఎనర్జీస్ అనే కంపెనీ ముందుకొచ్చింది.
కృష్ణాజిల్లాలో 3,680 కోట్ల పెట్టుబడితో థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆస్ర్టేలియాకు చెందిన క్వీన్స్‌లాండ్ కోల్ కార్పొరేషన్ తో ఎంఓయూ కుదిరింది. అలాగే స్టేట్ పవర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి 32 వేల కోట్లతో చైనాకు చెందిన శాని గ్రూపు సంస్థ 5 వేల మెగావాట్ల సామర్ధ్యం గల భారీ విద్యుత్తు ప్లాంట్‌ను 2020 నాటికల్లా పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 200 కోట్లతో స్టార్ హోటల్, సైక్లింగ్ జోన్‌లు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లోని శ్రీశక్తి హోటల్స్ అధినేత డి.వి.మనోహర్ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అనంతపురం జిల్లాలోని నందమూరి బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో 140 కోట్లతో ఎలక్ర్టానిక్ పరిశ్రమలు పెట్టేందుకు రాఘమయూరి ఎలక్ర్టానిక్ పార్క్ ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రీ ఫ్యాబ్రికేషన్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు అవసరమైన యూనిట్ ఏర్పాటు చేసేందుకు 100 కోట్లతో ప్రెకా సొల్యూషన్ అనే కంపెనీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పైప్‌ల ద్వారా గ్యాస్ పంపిణీ చేసే నెట్‌వర్క్ ఏర్పాటుకు హెచ్‌పీసీఎల్ సంస్థ 1000 కోట్లతో ముందుకొచ్చింది. అలాగే కృష్ణా జిల్లాలో 500 కోట్లతో సిటీ గ్యాస్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది.
శ్రీకాకులం జిల్లాలోని భావనపాడు, కళింగపట్నంలో రెండు బీచ్ శాండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 2500 కోట్ల పెట్టుబడితో ట్రైమెక్స్ సంస్థతో ఎంవోయూలు కుదిరాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కేశవరం కేంద్రంగా పనిచేసే దక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీని 1200 కోట్లతో విస్తరించేందుకు ఎంవోయూ కుదిరింది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన 65 ఒప్పందాలు చేసుకోగా, అందులో 42 కంపెనీలు ఏపీకి చెందినవే ఉన్నాయి. మొత్తం 65 సంస్థల పెట్టుబడుల విలువ 5892 కోట్లు కాగా, కృష్ణపట్నం పోర్టు సమీపంలో రూ.920 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఎస్ఎన్ఎస్ ఇంపెక్స్ కంపెనీ ఎంవోయూ కుదర్చుకుంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 13,300 కోట్లతో పెట్టుబడిదారులు సిద్ధమవ్వగా, 800 కోట్లతో ఓ టవర్‌ను నిర్మించేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే గృహనిర్మాణం కోసం హడ్కో 7500 కోట్లు, ఆంధ్రాబ్యాంకు 5,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.





