హరీష్ కట్టప్ప కాదు కోవర్టా.?

Is Harish Rao BJP Covert

బిఆర్ఎస్ లో మొదలైన కవిత తుఫాన్ చిలికి చిలికి సునామీ గా మారుతుంది. పార్టీ అధినేత కేసీఆర్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేత హరీష్ రావు వరకు కవిత ఏ ఒక్కరిని విస్మరించకుండా తనదైన స్టయిల్ లో అందరి మీద విమర్శల మోత మోగిస్తుంది.

అటు కేసీఆర్ విషయానికొస్తే, పార్టీ క్యాడర్ కు, లీడర్లకు అందుబాటులో ఉండడం లేదు అంటూ మొదలు పెట్టిన కవిత ట్విట్టర్ లో కాదు ప్రజా క్షేత్రంలో పోరాడండి అంటూ కేటీఆర్ ను, బిఆర్ఎస్ లో ఉంటూ బీజేపీ కి పనిచేస్తున్న కోవర్ట్ అంటూ హరీష్ రావు ని ఇలా బిఆర్ఎస్ కారుకి ఇంజన్, స్టీరింగ్, పెట్రోల్ మాదిరి పని చేస్తున్న ముగ్గురు నాయకులకు కవిత బ్రేక్ మాదిరి అడ్డుపడుతుంది.

ADVERTISEMENT

అయితే కవిత అరెస్టు తరువాత పార్టీలో జరిగిన పరిణామాలు, ఆమె బెయిలు పై బయటకు వచ్చిన నాటి నుంచి పార్టీలో తనకెదురవుతున్న పరిస్థితులను బేరీజు వేసుకున్న కవిత చివరికి పార్టీ అధిష్టాన నిర్ణయాల పై వ్యతిరేఖ స్వరం వినిపించే స్థాయికి చేరింది. బిఆర్ఎస్ ఓటమి నాటి నుంచి నేటి వరకు పార్టీ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భుజానకెత్తుకున్నారు.

ఇక బిఆర్ఎస్ పార్టీకి మరోతరం వారసుడు రానున్నాడు, నేడో రేపో కేటీఆర్ పట్టాభిషేకం లాంఛనమే అన్న సంకేతాలు బయటకు రావడంతో కేటీఆర్ నాయకత్వాన్ని సహించలేని కవిత ఈ విధంగా కేసీఆర్ కు లేఖ రూపంలో తన అయిష్టాన్ని, అసమ్మతిని తెలియచేసారు అనే వాదన తెలంగాణ రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది.

అందుకు తగ్గట్టే కవిత కూడా తానూ కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పని చేస్తాను, మరెవరిని తన నాయకుడిగా అంగీకరించను అంటూ ఖరాకండిగా ప్రకటించారు. ఇక కవిత లేఖాస్త్రం బయటకు రావడంతో బిఆర్ఎస్ సోషల్ మీడియాలో కవిత పై విమర్శలు మొదలయ్యాయి. అయితే బిఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం కేటీఆర్ ఆధ్వర్యంలోనే, కేటీఆర్ కోసమే పనిచేస్తుంది.

దీనిబట్టి పరోక్షంగా కేటీఆరే తనకు సోషల్ మీడియా వేదిక గా కౌంటర్లు ఇస్తున్నారు అనేది కవిత వాదన. అందుకుగాను కవిత కూడా అదే స్థాయిలో కేటీఆర్ పై పరోక్ష యుద్ధం ప్రకటించారు. సోషల్ మీడియాలో కాదు ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం అంటూ తన పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పారు కవిత.

ఇక అక్కడితో కూడా శాంతించని కవిత హరీష్ రావు ను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించింది. కొంతమంది బీజేపీ కోవర్టులు బీజేపీలో బిఆర్ఎస్ విలీనానికి ప్రణాళికలు రచిస్తున్నారు అంటూ పరోక్షంగా హరీష్ రావు ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

బీజేపీ నాయకుల ఆసుపత్రుల ఓపినింగ్ కార్యక్రమాలకు ఎవరు వెళ్లారు.? ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రారంభించింది ఎవరు.? వారంతా ఇప్పుడు బిఆర్ఎస్ విలీనానికి సిద్ధమయ్యారు అంటూ కవిత తన మీడియా సమావేశంలో ఆవేశంగా ప్రశ్నించారు.

అయితే 2022 అమీర్ పేటలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కూమార్తె ఆసుపత్రి ఓపినింగ్ కార్యక్రమానికి నాడు ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ నేత హరీష్ పాల్గొన్నారు. అలాగే ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా హరీష్ రావు ను బీజేపీ కోవర్ట్ గా చూపిస్తున్నాయి.

దీనికి తోడు 2024 తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో అసలు తెలంగాణలో బలమే లేని బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకోవడం, క్షేత్ర స్థాయిలో పట్టున్న ఉన్న బిఆర్ఎస్ సున్నా సీట్లకు పరిమితమవ్వడం చాల ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ ఘటన వెనుక కూడా ఈ కోవర్టుల ప్రమేయం ఉంది అనేలా కవిత ఆరోపణలు సాగాయి.

తెలంగాణలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలోపేతానికే బిఆర్ఎస్ ఎన్నికలకు దూరం జరిగింది అనే వాదన కూడా ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ బిఆర్ఎస్ కు హరీష్ ఎప్పటికైనా కట్టప్పే అనే ప్రచారం నుంచి ఇప్పుడు హరీష్ “కట్టప్ప కాదు బీజేపీ కోవర్ట్” అనే ప్రచారం ఊపందుకుంది.

ADVERTISEMENT
Latest Stories