
పొలిటికల్ ‘ఫైర్ బ్రాండ్’గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఏడాది పాటు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. గత 10 సంవత్సరాలలో సినీ ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారిని పరిశీలిస్తే… ఒక్క రోజా మాత్రమే ప్రజల్లో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది. అది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా..! చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారి మెగా హీరోల ఎంట్రీలు కేవలం కొద్ది కాలానికే పరిమితమైంది.
అంతేకాదు, ‘ప్రజారాజ్యం’ స్థాపించిన సమయంలో చిరంజీవిపై చేసిన దండయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ‘మెగాస్టార్’ హోదాలో ఉన్న చిరంజీవిపై విమర్శలు చేయాలంటేనే అప్పట్లో వణికిపోయేవారు. అలాంటి సందర్భాలలో కూడా రోజా తన దూకుడైన స్వభావంతో చిరును బహిరంగంగా ఏకిపారేసారు. ‘ప్రజారాజ్యం’ ప్రచారంలో చిరుకు సహకారం అందించిన పవన్ ను కూడా రోజా విడిచిపెట్టలేదు. ఒకానొక స్థాయిలో రోజా వాగ్ధాటికి జడిసి ఆమెకు బదులివ్వలేక మెగా హీరోలు చతికిలపడి చేతులెత్తేసారు.
అంతలా ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా, ప్రస్తుతం తనకు ఎదురుగా ఉన్న బాలకృష్ణను మాత్రం పల్లెత్తు మాట అనడానికి సంశయిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సహా ఇతర పార్టీ సభ్యులపై విమర్శల దాడులు చేస్తున్న రోజా, బాలయ్యను మాత్రం చాలా మంచివారుగా కొనియాడుతోంది. ఇటీవల జరిగిన ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో బాలయ్యపై స్పందించిన రోజా… “బాలకృష్ణ ఎక్కడ కనపడినా చాలా గౌరవంగా మాట్లాడతారు. అమ్మ గారు బాగున్నారా? నాన్న గారు బాగున్నారా? పిల్లలు బాగున్నారా?” అంటూ ఆప్యాయంగా మాట్లాడతారని బాలయ్యపై ప్రశంసలు కురిపిస్తోంది.
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ అగ్ర నటులే. ఈ ఇద్దరితోనూ రోజా పలు సినిమాలలో నటించింది. అయితే చిరుపై దండయాత్ర, బాలయ్యపై ప్రశంసల యాత్ర కురిపించడం… అనేది కేవలం వారి వారి వ్యక్తిత్వలకు ఇచ్చిన గౌరవమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత చిరు వ్యవహారశైలిని గమనించిన వారు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.





