ఇంతకీ షర్మిల కేసీఆర్‌తో పోరాడుతున్నారా.. సాయపడుతున్నారా?

YS Sharmilaవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్‌లో మళ్ళీ హడావుడి చేశారు. ఈరోజు ఆమె తన అనుచరులను, మీడియాను వెంటబెట్టుకొని నగరంలో శిధిలావస్థకు చేరుకొన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను సందర్శించేందుకు బయలుదేరారు. పోలీసులకు ఈవిషయం తెలియడంతో హడావుడిగా అక్కడికి చేరుకొని ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఆమెను అడ్డుకొనేందుకు భారీగా మహిళా పోలీసులను రంగంలో దింపారు.

దాంతో ఆమె పోలీస్ అధికారులపై మండిపడ్డారు. “నేనేమైనా కత్తులు, తుపాకులు పట్టుకొని దాడి చేయడానికి వెళుతున్నానా?ఉస్మానియా హాస్పిటల్‌ ఏవిదంగా ఉందో చూసి వద్దామని వెళుతున్నాను. కానీ నన్ను ఎందుకు అడ్డుకొంటున్నారు? నేను ఉస్మానియా హాస్పిటల్‌ చూస్తే మీకేమిటి ఇబ్బంది? ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం? అంటూ వాదించారు.

ADVERTISEMENT

కానీ మహిళా పోలీసులు ఆమెను ముందుకు కదలనీయకుండా అడ్డుకొన్నారు. దాంతో ఆమె వారిని తోసుకొంటూ ముందుకు పోయెందుకు ప్రయత్నించగా, ఆ తోపులాటలో వైఎస్ షర్మిల కింద పడిపోయారు.

ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్ళి ప్రజాస్వామ్యం గురించి గొప్పగా లెక్చర్స్ ఇస్తుంటారు కానీ ఇక్కడ రాష్ట్రంలో ఈవిదంగా నిరంకుశంగా ప్రతిపక్షాలను అణచివేస్తుంటారు. ఎవరైనా సమస్యల గురించి మాట్లాడితే ఇలా పోలీసులతో అడ్డుకొని వారి గొంతులు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ నియంత అని మరోసారి నిరూపించుకొన్నారు,” అంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వం ఓ పక్క కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుతో, మరోపక్క టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ స్కామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మీడియాలో ఈ రెండు అంశాలపైనే ఎక్కువగా వార్తలు వస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీ మరింత ఇబ్బందిపడుతోంది. ఈ పరిస్థితులలో వైఎస్ షర్మిల హటాత్తుగా ఉస్మానియా హాస్పిటల్‌ సందర్శనకని బయలుదేరడం, పోలీసులతో పెనుగులాటలు, కిందపడిపోవడం చూస్తే ఇంతకీ ఆమె కేసీఆర్‌తో యుద్ధం చేస్తున్నారా లేదా ఈవిదంగా హడావుడి చేస్తూ కుంభకోణాల మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కేసీఆర్‌కి తోడ్పడుతున్నారా?అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ ఆమె ఉస్మానియా హాస్పిటల్‌ సందర్శించాలనుకొంటే వెళ్ళి చూసి రావచ్చు. కానీ దాని కోసం ఇంత హడావుడి చేయడం చాలా నాటకీయంగా ఉంది. ఆమె కేసీఆర్‌ను నోటితో విమర్శిస్తూ చేతలతో సహకరిస్తున్నట్లున్నారు.

ADVERTISEMENT
Latest Stories