‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో దర్శకుడిగా మొదటి చిత్రంతోనే సూపర్ హిట్‌ను అందుకున్న మేర్లపాక గాంధీ తన మొదటి సక్సెస్ గాలివాటం కాదు అని తాజాగా విడుదలైన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రంతో నిరూపించుకున్నాడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సక్సెస్‌ను సాదించి మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ వార్తల గురించి గాంధీ స్పందిస్తూ ప్రస్తుతానికి చరణ్ మూవీ ఖరారు కాలేదు అని చెప్పాడు.
‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రం సక్సెస్ అయితే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చరణ్ నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో అప్పుడే వార్తలు వచ్చాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడంతో చరణ్, గాంధీల కాంబోలో సినిమా రావడం ఖాయం అని అంటున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ పని పూర్తి అయిన తర్వాత చరణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ ఎక్స్ ప్రెస్ దర్శకుడికి చరణ్ అవకాశం ఇచ్చేనో చూడాలి. త్వరలో చరణ్ ‘తని ఒరువన్’ రీమేక్‌లో నటించబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత గాంధీతో సినిమా చేస్తాడేమో చూడాలి.





