గత కొన్నాళ్లుగా విడుదలకు నోచుకోలేని నారా రోహిత్ ‘శంకర’ సినిమా నుండి, పక్కా ప్రణాళికతో వచ్చిన పూరీ జగన్నాధ్ – నందమూరి కళ్యాణ్ రామ్ ల “ఇజం” సినిమా వరకు, దాదాపుగా అయిదు సినిమాలు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకేసారి థియేటర్ల పైకి దండయాత్ర చేసిన ఈ సినిమాలలో ఒక్కటైనా ప్రేక్షకులను మెప్పించిందా? ఎంటర్టైన్మెంట్ కోసం పరితపిస్తున్న సినీ జనాలకు ఒక్క సినిమా అయినా పూర్తి సంతృప్తిని పంచిందా? ఏ సినిమా టాక్ ఎలా ఉందో ఓ సారి లుక్కేద్దాం.
ముందుగా విడుదలైన అన్ని సినిమాలలోకల్లా ప్రేక్షకులకు సుపరిచితం అయిన దర్శకుడు, హీరో కాంభినేషన్ అయిన “ఇజం” ఒక్కటే అంచనాలతో విడుదలైంది. అయితే వాటిని అందుకోవడంలో పూరీ మరోసారి విఫలమయ్యారనే ఫస్ట్ టాక్ వచ్చింది. ఒక వర్గం ఆడియన్స్ ను పూరీ సంతృప్తి పరిచినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సందడి చేసేటంత మ్యాజిక్ ను ‘ఇజం’ చేత సృష్టించలేకపోయారనేది తొలి టాక్. భిన్న స్పందనలు తెచ్చుకున్న ఈ సినిమాలో కుటుంబ కధాంశాలు, కామెడీ మైనస్ గా మారాయి. దీంతో ఎంతమేరకు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో తెలియాలంటే, మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
ఇక, ప్రిన్స్ మహేష్ బాబు ఆడియో విడుదల చేయడంతో కాస్త ప్రేక్షకులలో గుర్తింపు పొందిన “నందిని నర్సింగ్ హోం” సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేష్ తనయుడు నవీన్ నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. ప్రేక్షకులకు కావాల్సిన టైం పాస్ కామెడీని సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా అందివ్వడంతో, మౌత్ టాక్ పరంగా ఇతర చిత్రాల కంటే ముందు వరుసలో ఉంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో కామెడీ చిత్రాలు కరువైపోవడంతో, ఈ సినిమా అంచనాలు వేసిన స్థాయి కంటే మరో మెట్టును చేరుకునే అవకాశముందని ట్రేడ్ టాక్. లో బడ్జెట్ లో తెరకెక్కించడం కూడా అతి పెద్ద ప్లస్ పాయింట్.
ఎన్నాళ్ళుగానో విడుదల కోసం వేచిచూస్తున్న నారా రోహిత్ “శంకర” ప్రేక్షకులకు కావాల్సిన కొత్తదనాన్ని పంచడంలో విఫలమైందనే టాక్ వెలువడింది. నారా రోహిత్ అభినయం మినహా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏమీ లేదని, పూర్తి నిరాశజనకమైన టాక్ ను ఈ “శంకర” కైవసం చేసుకుంది. ఇక, బుల్లితెర హాట్ బ్యూటీ రష్మి నటించిన “తను వచ్చేనంట” సినిమా మరోసారి ప్రభావం చూపలేకపోయిందనే టాక్ అందుకుంది. చలాకీ చంటి కామెడీ సన్నివేశాలు మినహా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని వీక్షకుల టాక్. అలాగే కొత్తవారితో తెరకెక్కిన ‘ఎల్ 7’ పరమ రొటీన్ హర్రర్ కధ అని తేల్చేసారు.
మొత్తమ్మీద ‘మౌత్ టాక్’ పరంగా ‘నందిని నర్సింగ్ హోం’ కామెడీ వలన ముందు వరుసలో ఉండగా, అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ‘ఇజం’ నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా నిలవడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. విడుదలైన 5 సినిమాలలో బరిలో అయితే ఈ రెండు సినిమాల పేర్లే ప్రేక్షకుల నుండి వినిపిస్తున్నాయి.



