జగన్ తనకు అలవాటులేని ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడబోతున్నప్పుడు ఆయన సొంత మీడియాలో పెద్దలు ముందుగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో? ఏది ఎంతవరకు మాట్లాడాలో?అసలు ప్రెస్‌మీట్ అవసరమా కాదా?వంటి విషయాలు జగన్‌కి వివరిస్తూ ఉండాలి.
ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలాంటి విషయాలు చెప్పేందుకు కార్యదర్శులు, సలహాదారులు ఉంటారు. కానీ ఇప్పుడు లేరు కనుక సాక్షి మీడియా లేదా సీనియర్లు ఆ బాధ్యత తీసుకొని ఉండాలి కదా? కానీ పిల్లి మెడలో గంట కట్టడం ప్రమాదమని అందరూ కేవలం పక్క నుంచి ‘ప్రాంప్టింగ్’తో సరిపెట్టుకుంటున్నట్లు భావించవచ్చు.
నిన్న ప్రెస్‌మీట్‌లో ‘దున్నపోతు ఈనిందంటే..’ అనే సామెత పూర్తి చేయడానికి జగన్ ‘ప్రాంప్టింగ్’ తీసుకోవడమే ఇందుకు చక్కటి ఉదాహరణ.
జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెడుతుంటే ముందు నుంచే ఆయన సొంత మీడియా హైప్ క్రియేట్ చేసిపెడుతుంది కానీ ప్రెస్‌మీట్‌లో ఆయన తెలుగులో మాట్లాడలేక తడబడుతూ, ఎడాపెడా నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తూ గందరగోళం సృష్టించుకుంటారు.
మద్యం కుంభకోణం కేసులో ఇంత వరకు ఆయన పేరుని ఛార్జ్-షీట్‌లో పేర్కొనలేదు. కనీసం సిట్ అధికారులు ఆయన పేరు ప్రస్తావించనే లేదు. కానీ జగన్ తొందరపడి ప్రెస్‌మీట్ పెట్టి మద్యం కుంభకోణం గురించి ఎడాపెడా మాట్లాడేసి, “అరెస్ట్ అవడం అంటే ఎవరికైనా ఇబ్బందికరమే. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడే ఉన్నాను. కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు,” అనేశారు.
ఈ కేసులో తాను అరెస్ట్ కాబోతున్నానని జగన్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించుకునట్లయింది. ఇది వైసీపీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపినట్లే కదా?
బహుశః అరెస్ట్ అవడం అంటే ఎవరికైనా ఆందోళన కలిగిస్తుందని జగన్ చెప్పుకున్నారు కనుక ఆ భయాందోళనలతోనే ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చు.
లేదా కూటమి ప్రభుత్వం తనని అరెస్ట్ చేయబోతోందని చెప్పుకొని వైసీపీ శ్రేణులను మానసికంగా సిద్దం చేసేందుకు కావచ్చు.
లేదా ఎలాగూ అరెస్ట్ తప్పదు కనుక ఇప్పుడే దాని గురించి మాట్లాడుతూ, రేపు అరెస్ట్ అయిన తర్వాత తనని కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేసిందని ప్రజలను సులువుగా నమ్మించవచ్చని కావచ్చు.
కానీ ఇప్పుడు జగన్ జైలుకి వెళితే పార్టీ చెల్లా చెదురు అయిపోకుండా కాపాడుకునేందుకు షర్మిల లేరు. తల్లి విజయమ్మ పార్టీని నడిపించలేరు. ఢిల్లీలో చక్రం తిప్పి అడ్డుకునేందుకు విజయసాయి రెడ్డి కూడా పక్కన లేరు.
అయిన వాళ్ళందరినీ జగన్ దూరం చేసుకున్నారు కనుక తాను అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటే పార్టీని ఎవరు నడిపిస్తారు? చెల్లా చెదురు అయిపోకుండా ఎవరు కాపాడుతారు? అని ఆలోచించి ప్రెస్‌మీట్ పెట్టి తన అరెస్ట్ ప్రకటన చేసి బెంగళూరు వెళ్ళిపోయే బదులు, పార్టీలో సీనియర్ నేతలను అత్యవసరంగా ప్యాలస్‌కు పిలిపించుకొని వారిలో నంబర్: 2ని ఖరారు చేసుకొని ఉంటే బాగుండేది కదా?




