అధికార ప్రతిపక్షాలు పరస్పరం విమర్శించుకోవడం ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణమే. ప్రస్తుతం ఏపీలో వైసీపి-టిడిపి, జనసేన, బీజేపీలు కూడా అదే చేస్తున్నాయి. అయితే మద్యలో వైఎస్ షర్మిల ప్రవేశించి అన్న జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేస్తుండటమే చాలా వెరైటీగా ఉంది.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలకు ఏవిదంగా అలుసో, అదేవిదంగా వైఎస్ షర్మిలకు కూడా అన్న జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డి ఇద్దరూ ‘సాఫ్ట్ టార్గెట్స్’గా మారిపోయారని చెప్పవచ్చు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు వైఎస్ షర్మిల అడుగుతున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మాత్రం సూటిగా సమాధానాలు చెప్పలేక తడబడుతున్నారు.
ఇవే ప్రశ్నలు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ అడిగితే వెంటనే వారిపై వైసీపి నేతలు ముప్పేట దాడి చేస్తారు. కానీ వైఎస్ షర్మిలకు జవాబు చెప్పలేకపోతుండటంతో, ఎన్నికల ప్రచారంలో నానాటికీ ఆమె విమర్శలు పదునెక్కుతున్నాయి.
శ్రీకాళహస్తిలో ఆమె కాంగ్రెస్ అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారంలో, “జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుడిలా 5 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు ఎన్నికలకు ముందు నిద్రలేచి శంకుస్థాపనలతో హడావుడి చేశారు.
రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలుమ ఐటి కంపెనీలు రావు. ఉన్నవాటిని ఉండనీయరు. లేనివాటికి శంకుస్థాపనలు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ మెగా డీఎస్సీ అంటారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ గుర్తురాదు.
దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి కానీ ఒక్క ఏపీకి మాత్రమే రాజధాని లేదు. అయినా ఈ జగన్మోహన్ రెడ్డికి, మంత్రులు, ఎమ్మెల్యేలకి అసలు సిగ్గు, అవమానంగా అనిపించడమే లేదు.
యధారాజా అన్నట్లు అక్కడ జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తుంటే, ఇక్కడ మీరు ఎన్నుకొన్న వైసీపి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ప్రభుత్వ భూములు, చివరికి చెరువులు కూడా కబ్జా చేసేస్తున్నారు. ఈ 5 ఏళ్ళలో నియోజకవర్గానికి, ప్రజలకు చేసిందేమీ లేకపోయినా ఇసుక,మ మట్టి మాఫియాతో కోట్లు వెనకేసుకున్నాడు.
ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ఎమ్మెల్యేలు మనకి అవసరమా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మార్పు తీసుకురాగలదు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ప్రత్యేక హోదా లభిస్తుంది,” అని వైఎస్ షర్మిల అన్నారు.
వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకున్న మాట వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీలో అనేకమంది సీనియర్లు ఉండగా కేవలం ఆమె ఒక్కరే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సంస్కృతికి ఇది అసలు నప్పదు.
ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎలాగూ లేదు… ఉండదు కనుక అనవసరంగా నోరు పారేసుకొని ఆనక తీరికగా బాధపడటం ఎందుకని పార్టీలో సీనియర్లు ఎవరూ నోరు విప్పకుండా ఆమె వెనుక మౌనంగా నిలబడుతున్నారు. కానీ వైఎస్ షర్మిల మాత్రం జగనన్ననే టార్గెట్ చేసుకొని దంచేస్తూనే ఉన్నారు. ఆమెకు విరుగుడు ఏమిటో… ఎప్పుడో?




