అధికారుల నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారు. కొందరు ఈ సంఖ్య పాతిక వరకు ఉంటుందని అంటున్నా ప్రభుత్వ లెక్కల ప్రకారం అది పదకొండు. యధావిధిగా ఈ ఘటన పై ముఖ్యమంత్రి, గవర్నర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇక రుయా మృతలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అయితే దీనిపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి ఘటన జరిగినప్పుడల్లా దిగ్బ్రాంతిని వ్యక్తం చెయ్యడం…. పరిహారం ప్రకటించడం పరిపాటి అయిపోయిందని.. అయితే ఇటువంటి అనర్ధాలు జరగకుండా… జరిగాకా బాధ్యుల మీద చర్యలు తీసుకోకపోవడం వంటి వాటి మీద విరుచుకుపడుతున్నారు.
విశాఖ గ్యాస్ లీక్ మీద ఇప్పటిదాకా బాధ్యుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏడాది గడిచినా అక్కడ వారికి నష్టపరిహారం అందాని మాట వాస్తవం కాదా? అక్కడ బాధితుల కోసం నిర్మిస్తామన్న సూపర్ స్పెషలిటీ ఆసుపత్రికి కనీసం శంకుస్థాపన కూడా చెయ్యలేదు అనేది నిజం కాదా అంటూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇకపోతే తిరుపతి ఘటనలో ఆక్సిజన్ కు ఐదు నిముషాలే అంతరాయం కలిగిందని… వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలామందిని రక్షించామని చాలా తేలికగా అదే సమయంలో అదేదో తమ గొప్పతనం వల్లే ప్రాణనష్టం తగ్గిందని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తేలికగా చెప్పేయడం పై కూడా విమర్శలు వస్తున్నాయి.





