ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు అంటే భయం పట్టుకుందా? అంటే అవుననే అంటున్నారు కొందరు. ఒకప్పుడు ఎన్నికలు కావాలని పట్టుబట్టిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం అసలు వద్దు అనడం విశేషం. ఆ విషయాన్నే ప్రభుత్వం హైకోర్టులో కూడా చెప్పేసింది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అవుతుంది.
తాజాగా తమ వాదన గెలిపించుకోవడానికి తమకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాల నేతలతో స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారు. “ఎన్నికలు నిర్వహిస్తే ఉద్యోగుల ప్రాణాలకు ఎవరు బాధ్యులు?,” అని వారితో మీడియా కు చెప్పించారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… ప్రభుత్వం స్కూళ్లు తెరిస్తే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏమైపోయారు అనేది తెలీదు.
ఈ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధాని పెట్టదల్చిన విశాఖ జిల్లాలో స్కూళ్లలో 52 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 46 మంది టీచర్లు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలారు. చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో టీచర్లు, విద్యార్థులకు కరోనా రావడం అటు పేరెంట్స్ ని కూడా కలవర పెడుతుంది.
స్కూళ్లే క్లోజ్ చెయ్యాలని డిమాండ్లు వస్తున్న సమయంలో ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లు కూడా తెరవడానికి సిద్ధం అవుతుంది. అయినా ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు నోరుమెదపకపోవడం విశేషం. ఉద్యోగ సంఘాల నేతలను ఏపీ ప్రభుత్వం కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తుందా? అనే విమర్శలు వస్తున్నాయి.




