2027 తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనుందా.?

Jagan and KTR political padayatra plans

రెండు తెలుగు రాష్ట్రాలలో విపక్ష పాత్రలో రాజకీయాలు సాగిస్తున్న వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఒకే వ్యూహాన్ని ఎంచుకున్నాయా.? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. 2027 కేంద్రంగా ఏపీలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గత పదేళ్లుగా తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బిఆర్ఎస్ క్షేత్ర స్థాయి రాజకీయానికి దూరమయ్యింది అనే భావన పార్టీ అధిష్టానం నుంచి పార్టీ క్యాడర్ వరకు వినిపిస్తుంది. ఒక రకంగా బిఆర్ఎస్ ప్రస్తుత స్థితికి, దుస్థితికి ప్రధాన కారణం కూడా ఇదే అనే వాదన నడుస్తుంది.

ADVERTISEMENT

అధికారానికి ముందు ఉద్యమ నాయకుడిగా ప్రజల మధ్య కలయతిరిగిన కేసీఆర్ ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి చేతికి రావడంతో ఇక ప్రజారాజకీయాలకు స్వస్తి పలికి ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వాగతం పలికారు అనే భావన తెలంగాణ ప్రజలలో బలంగా నాటుకుపోయింది. దశాబ్దం పాటు కేసీఆర్ సాగించిన ఫామ్ హౌస్ రాజకీయాల తాలూకా ఫలితాలు చివరికి పార్టీని ప్రజలకు పూర్తిగా దూరం చేసేలా చేసింది.

దీనితో తిరిగి బిఆర్ఎస్ ను క్షేత్ర స్థాయి నుంచి రాజకీయంగా బలోపేతం చేసేందుకు, తిరిగి పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు, బిఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు, కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ 2027 లో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు.

ఇక అలాగే, గత ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా పాదయాత్రలతో సాధించుకున్న అధికారాన్ని పరదాల యాత్రలతో పాతిపెట్టుకుంది అనే చెప్పాలి. ముఖ్యమంత్రి అంటే బాధ్యత కాదు అదొక అధికారం చెలాయించే సింహాసనం అన్నట్టుగా సాగిన వైసీపీ పాలన ప్రజలతో పాటుగా చివరికి సొంత పార్టీ క్యాడెర్ ని కూడా పార్టీకి దూరం చేసేలా చేసింది.

దీనితో జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అధికారంతో, పదవితో వైసీపీ పార్టీకి ప్రజలకు మధ్య పెరిగిన దూరాన్ని తిరిగి పూర్తిగా చెరిపేందుకు జగన్ 2027 లో తన పాదయాత్ర ఉంటుందంటూ ప్రకటించారు. పాత అనుభవానికి కొత్త రూపం జోడించి ఏపీలో జగన్ 2.0 పాదయాత్ర సిద్ధమవుతుంటే, అటు తెలంగాణ క్షేత్ర స్థాయిలో బిఆర్ఎస్ పట్ల ప్రజలలో ఉండే పాత జ్ఞాపకాలను తట్టి లేపడానికి కేటీఆర్ పాదయాత్ర మొదలవబోతుంది.

అయితే 2027 లో మొదలవబోతున్న జగన్, కేటీఆర్ ల పాదయాత్రలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంటుందా.? ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను, తెలంగాణలో రేవంత్ సర్కార్ పై కనిపించే ప్రజా తిరుగుబాటును వైసీపీ – బిఆర్ఎస్ లకు అనుకూలంగా జగన్, కేటీఆర్ మార్చగలరా.?

ఏపీలోజగన్ ఐదేళ్ల పాలన చూసిన ప్రజలు వైసీపీ కి మరో ఛాన్స్ ఇస్తారా.? ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చేస్తున్న రప్ప రప్ప రాజకీయాలకు గమనిస్తున్న సామాన్యులు జగన్ చేతికి మరోసారి సీఎం పదవి అప్పగిస్తారా.? రాష్ట్ర రాజధాని నుంచి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి వరకు, రాజకీయ కక్ష సాధింపు చర్యల నుంచి గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పై పడిన మత రాజకీయ ముద్ర వరకు వైసీపీ పట్ల ప్రజలలో ఉన్న అన్ని అనుమానాలను, అపనమ్మకాలను జగన్ తన పాదయాత్రతో చెరపగలరా.?

అలాగే ఇటు గత పదేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీల మీద సాగించిన నిరంకుశత్వ విధానాలను, ప్రజలకు జవాబుదారీ తనం లేని పాలనను కేటీఆర్ తన పాదయాత్రతో తుడిచిపెట్టగలరా.? ఈ ఇద్దరి పాదయాత్రలు వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలకు తిరిగి జీవం పొయనున్నాయా.? అలాగే ఆ పార్టీని నమ్ముకున్న నాయకుల, కార్యకర్తల ఆశలను నెరవేర్చనున్నాయా.? అనేది భవిష్యత్ లో తేలనుంది..!

ADVERTISEMENT
Latest Stories