ఉద్యోగాల కల్పన అంటే నెలకు రూ.5,000 జీతంతో వాలంటీర్లు నియమించుకొని పార్టీ కోసం పని చేయించుకోవడమా? లేక పోలీస్, విద్యా తదితర శాఖలలో ఉద్యోగులను భర్తీ చేయడమా? అంటే సమాధానం అందరికీ తెలుసు.
వైసీపీ హయంలో డీఎస్సీ గురించి పనికిరాని మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేసేసి, ఎన్నికలకు ముందు డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగ యువతకు వల వేసింది. ఎవరూ పడలేదు… ఆ వలలో వైసీపీయే చిక్కుకొని గద్దె దిగాల్సి వచ్చింది.
అలాగే వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలు భర్తీ చేయకుండా సంక్షేమ పధకాల పేరుతో యువతకు డబ్బు పంచిపెడుతూ ప్రభుత్వంపై ఆధారపడేలా చేసింది.
కనీసం ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలనైనా తెచ్చి ఉద్యోగాలు కల్పించిందా?అంటే అదీ లేదు. వైసీపీ హయంలో ఎన్ని వేలమంది యువతీ యువకులు, కుటుంబాలు ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వలసలు పోయారో లెక్కేలేదు.
ఇంత నిర్వాకం చేసిన వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలండర్ విడుదల చేసి దాని ప్రకారం డీఎస్సీ ప్రకటించి సుమారు 16 వేల మంది ఉపాధ్యాయులను , పోలీస్ శాఖలో కూడా సుమారు మరో 16 వేల మందిని భర్తీ చేస్తే, నిత్యం పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తూనే ఉంది.
వైసీపీ అధినేత జగన్ అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఉద్యోగాల భర్తీని వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు. ఓ పక్క అభివృద్ధి పనులపై దుష్ప్రచారం చేస్తూనే మరో పక్క వాటి క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు.
శాసనసభలో తనకు ప్రధాన ప్రతిపక్షనాయకుడు హోదా కావాలని పట్టుబడుతూ శాసనసభ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి మొహం చాటేస్తున్నారు. కానీ అయన వైసీపీని నడిపిస్తున్న ఈ తీరు చూస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షంగా కూడా పనికిరాదని సిఎం చంద్రబాబు నాయుడు ఊరికే అనలేదు.
రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడకపోయినా పర్వాలేదు. కానీ ఇలా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ అవరోధాలు కల్పించకూడదు కదా?
కానీ సిఎం చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో, రాజకీయ కక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శత్రువుగా భావిస్తున్నట్లు వ్యవహరిస్తుంటే, ప్రజలు ఏమనుకుంటారు? తన పట్ల, వైసీపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఇంకా పెరుగుతుందా లేక అభివృద్ధి నిరోధక పార్టీకి అధినేత అని అభిమానిస్తారా? ఆలోచిస్తే మంచిది.





