బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెరకెక్కించిన “జై లవకుశ” సినిమాలోని రెండవ పాత్ర ‘లవ’ను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ గత యూ ట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టడంలో విఫలమైంది. యూ ట్యూబ్ రికార్డ్స్ మాట దేవుడేరుగు… ఇటీవల విడుదలైన ‘స్పైడర్’ రెండవ టీజర్ క్లిక్స్ కు కిలోమీటర్ దూరంలో నిలిచిపోవడం ఊహించని పరిణామం.
‘స్పైడర్’ రెండవ టీజర్ కంటే ‘జై లవకుశ’ రెండవ టీజర్ బాగుందన్న టాక్ సర్వత్రా వ్యక్తమైన అభిప్రాయం. దీంతో ‘స్పైడర్’ రెండవ టీజర్ 24 గంటలలో అందుకున్న 4.04 మిలియన్ క్లిక్స్ ను అవలీలగా ‘జై లవకుశ’ అధిగమించేస్తాడని ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ఆశించారు. కానీ 24 గంటలు పూర్తయ్యే సమయానికి ‘జై లవకుశ’ కేవలం 3.2 మిలియన్ క్లిక్స్ ను మాత్రమే అందుకోవడం విశేషం. అంటే టాక్ పరంగా ఎన్టీఆర్ టీజర్ పైచేయి సాధించినప్పటికీ, రికార్డుల పరంగా మహేష్ టీజర్ ఒక మెట్టు పైన ఉందన్నమాట.
అయితే మొదటి స్థానంలో మాత్రం ‘జై’ పాత్రను పరిచయం చేసిన టీజర్ 4.89 క్లిక్స్ తో ఉండగా, రెండవ స్థానంలో ‘గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్’ 4.3 మిలియన్ క్లిక్స్ తో నిలిచింది. మూడు, నాలుగు స్థానాలలో స్పైడర్, జైలవకుశ రెండవ టీజర్లు వరుసగా, నిలువగా, టాప్ 5లో చివరి స్థానంలో ‘కాటమరాయుడు’ 2.97 క్లిక్స్ తో నిలిచాడు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కొత్త సినిమా టీజర్ కూడా వస్తుందన్న సంకేతాలతో ఈ రికార్డులన్నీ బద్ధలవుతాయన్న ఆశతో పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు.


