పిఠాపురం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో అడుపెట్టాలి అని ఆశించిన SVSN .వర్మ పొత్తులో భాగంగా తన సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసారు. ముందుగా పవన్ పోటీని కాస్త వ్యతిరేకించిన వర్మ, అతని అనుచర గణం వారి అధినేత బాబు తో చర్చల అనంతరం శాంతించారు.
2014 ఎన్నికలలో పిఠాపురం ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 90 వేల ఓట్లు సాధించి టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఓడించారు. ఆతరువాత జరిగిన పరిణామాల రీత్యా అధికార టీడీపీ కండువా కప్పుకుని టీడీపీ అభ్యర్థిగా 2019 లో అదే స్థానం నుండి బరిలో దిగి జనసేన ఓట్ల చీలిక ఫలితంగా వైసీపీ అభ్యర్థి పై ఓటమి చెందారు.
గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ 2024 ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు వర్మ. ఇటువంటి తరుణంలో పొత్తులో భాగంగా సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి రావడంతో ముందుగా కాస్త నిరుత్సహపడినప్పటికీ అధినేత బుజ్జగింపులతో చల్లబడ్డారు. అంతేకాకుండా పవన్ గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకుంటా అంటూ అటు జనసేన క్యాడర్ కు ఇటు టీడీపీ అధినాయకత్వానికి హామీ ఇచ్చారు వర్మ.
ఈ నేపథ్యంలో భాగంగా పిఠాపురం ఎన్నికల ప్రచారానికి సిద్దమైన పవన్ పిఠాపురం రాగానే ముందుగా వర్మ ఇంటికి వెళ్లారు. తన కోసం వర్మ చేసిన త్యాగానికి ఇది పవన్ ఇచ్చిన గౌరవంగా భావించాలి. ఆయన కుటుంబ సభ్యులను కలిసి వర్మ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు పవన్. ఒక పార్టీ అధినేత అయ్యిఉండి మరో పార్టీ అభ్యర్థి ఇంటికి వెళ్లి తన గెలుపు కోసం మద్దతు కోరడం శుభపరిణంగా పరిగణించాలి.
పిఠాపురంలో బలమైన నాయకుడిగా నిరూపించుకున్న వర్మను కలుపుకుని ముందుకెళ్లడం అంటే పవన్ తన మెజారిటీ ని పెంచుకున్నట్లే పరిగణించాలి. తానూ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లినా స్థానికంగా బలమైన నేత తనకు మద్దతుగా నిలబడితే అది జనసేన గెలుపుకి మార్గం సులభం చేసినట్లే. అలాగే తమ నాయకుడి పట్ల పవన్ చూపిన ప్రేమ, గౌరవానికి వర్మ క్యాడర్ కూడా పవన్ కోసం జనసేన జెండా మోయడానికి సిద్ధమవుతారు.
ఇలా ఒకరి త్యాగాన్ని గుర్తించి వారికీ సరైన గౌరవం ఇవ్వగలిగితే పొత్తులో ఉన్న పార్టీల మధ్య ఓటు బదిలీ సులభం అవుతుంది. ఇదే ఆనవాయితీని మూడు పార్టీల నేతలు, వారి పార్టీల అధినేతలు పాటించి ముందుకెళ్లగలిగితే ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ నాయకుడు సర్వ శక్తులు ఒడ్డి పోరాడగలుగుతాడు.




