టీడీపీ – జనసేన పొత్తు ప్రకటన తరువాత ఇరు పార్టీల నేతల నుండి కొంత అసమ్మతి, కొంత అసంతృప్తి బయటకు వచ్చిన మాట వాస్తవమే . అయితే పొత్తు లేకుండా సింగల్ గా వస్తున్నాం అంటూ తొడలు కొడుతున్న వైసీపీ పార్టీకి కూడా తమ పార్టీ నేతల నుండి అసమ్మతి సెగ తప్పలేదు.
అటు వంటి సందర్భంలో టీడీపీ, జనసేన పార్టీల నేతల మధ్య ఈ మాత్రం అసంతృప్తి ఊహించిందే అయినప్పటికీ ఇది ప్రత్యర్థి పార్టీకి బలంగా మారకముందే ఇరు పార్టీల అధినేతలు తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుని పార్టీ నాయకులను కట్టడి చేయవలసి ఉంటుంది.
తాజాగా జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ బత్తిన రాము టీడీపీ, జనసేన పార్టీల మధ్య జరిగిన సీట్ల పంపకాల గురించి సాక్షి టీవీ లో పంచాయితీ పెట్టారు. ఎలా అయినా ఈ రెండు పార్టీల పొట్టుని విచ్ఛిన్నం చేయడమే తమ ప్రధమ ఎజండాగా ముందుకెళ్తున్న ప్రత్యర్థి పార్టీ ఛానెల్ కు జనసేన నాయకుడు ఇంటర్ వ్యూ ఇవ్వడం, మిత్రపక్షమైన టీడీపీ పై విమర్శలు చేయడం చూస్తుంటే బత్తుల ఎజండా వేరేదో ఉందా అనే అనుమనాలు తలెత్తుతున్నాయి.
పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన సీట్ల విషయంలో ఏదైనా అసంతృప్తి ఉన్నా, దానికి సంబందించిన విషయంలో పార్టీ అధినేతకు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకున్న దానికి బత్తుల ఎంచుకున్న మార్గం సరికాదు. గత ఎన్నికలో మన పార్టీకి వచ్చిన ఓట్లు, సీట్లు ప్రకారమే 24 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది అంటూ పవన్ సీట్ల ప్రకటన సమయంలో ప్రకటించినప్పటికీ జనసేన నేతలు టీడీపీ పై ఇటువంటి విమర్శలు చేయడం
సమంజసం కాదు.
జనసేన పార్టీ కార్యకర్తల స్థాయి వారు ఇలా ఆలోచించి తమ మనోభావాలను వ్యక్తపరిచినప్పటికీ అది వారి ఆవేదన కింద భావించి పార్టీ నాయకులే వారికీ సర్ది చెప్పి పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన ఇటు వంటి కీలక సమయంలో పార్టీ నేతలే ప్రత్యర్థులకు కాళ్ళిస్తే…ఇక పార్టీ అధినేత నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళేది ఎవరు..? విజవాడ తూర్పు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు వంటి ఓటమి ఎరుగని బలమైన నేత బరిలో ఉన్నప్పుడు ఆ సీటుని టీడీపీ ఎలా వదులుకోగలుగుతుంది..?
గత ఎన్నికలలో త్రిముఖ పోటీలో కూడా గద్దె 44 .4 % ఓటు పెర్సెంటేజ్ తో 82990 ఓట్లతో ప్రధమ స్థానంలో ఉంటే వైసీపీ నుంచి పోటీ చేసిన బొప్పన బావకుమార్ 67826 ఓట్లతో 36.29 % ఓట్ల శాతంతో రెండవస్థానంలో, జనసేన నుంచి పోటీ చేసిన బత్తిన రాము 30137 ఓట్లతో, 16 .12 % ఓటు శాతం నమోదు చేసుకుని మూడవ స్థానంలో నిలిచారు. అంటే జనసేన కు వచ్చిన ఓట్లకు దాదాపు మూడింతలు ఎక్కువ ఓట్లు టీడీపీ అభ్యర్థి సాధించుకున్నారు. ఇటువంటి సీట్లను టీడీపీ నే కాదు ఏ పార్టీ కూడా వదులుకోలేదు.
పార్టీకి ఇంత బలమున్న స్థానాలను వదులుకుని ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే సాహసం ఏ పార్టీ అధినేత చేయలేరు. అది పొత్తు లక్ష్యానికి కూడా విఘాతం కలిగించే నిర్ణయమే అవుతుంది అనేది బత్తిన రాము తెలుసుకోవాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ ఒక పక్క పొత్తుల పావులు కదుపుతుంటే….జనసేన నేతలు తమ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ ప్రత్యర్దులకే చేచేతుల ఆహారాన్ని అందిస్తే ఇక అధినాయకుడు లక్ష్యం చేరేదెలా..?
ఇచ్చిన స్థానాల గురించి నిరాశపడి వచ్చిన అవకాశాన్ని చేచేతు జారవిడుచుకుంటున్నారు ఇటువంటి నాయకులు. ఇలా పార్టీలోని ప్రతి ఒక్కరు తమతమ మనోభావాలను వ్యక్త పరుస్తూ ఇరుపార్టీల నేతలు చేసిన, చేస్తున్న త్యాగాలను బూడిదలో పోసిన పన్నీరు మాదిరి మార్చాలనుకుంటున్నారా..? పొత్తుని నిలబెట్టడానికి కేంద్ర నాయకత్వంతో ఎన్నో చివాట్లు తినను అంటూ అధినాయకుడు చెప్పుకుంటుంటే పార్టీలోని నాయకులు మాత్రం మిత్ర పక్షం పై చిందులు తొక్కితే ఇక రెండు పార్టీల మధ్య ఓటు వదిలి జరిగే అవకాశం ఉంటుందా…?
పొత్తులో భాగంగా సీట్లు దక్కని నాయకులకు, పార్టీ కోసం బలంగా నిలబడిన వ్యక్తులకు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తరువాత తగిన న్యాయం చేస్తాం అంటూ అధినేతలు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పదవుల కోసం, అధికారం కోసం సొంత కుటుంబాన్నే రోడ్డుకీడ్చిన ఆత్మసాక్షి లేని సాక్షిలో చేస్తున్న ఈ ప్రసంగాల పరమార్థం ఏమిటో…? సొంత పార్టీనే సమాధి చేస్తూ ఇటువంటి నేతలు చేస్తున్న త్యాగాలు ఎవరి కోసమో..?
పొద్దున్న లేస్తే మూడు పెళ్లిళ్లు, ముగ్గురు పెళ్ళాలు అంటూ పవన్ వ్యక్తిగత జీవితాన్ని బజారుకు లాగుతూ తనను , తన కుటుంబాన్ని అత్యంత హీనంగా కించపరిచే మీడియాలో కూర్చుకుని పవన్ బాగు కోసమే నా ఈ ప్రయత్నం అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెపితే దాని నమ్మడానికి పవన్ సిద్ధంగా ఉంటారా..?




