పవన్ కష్టం, కష్టార్జితంతో గుర్తింపు పొందినప్పుడు…

Janasena MLA Arava Sridhar Resigns as Govt Whip

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నేడు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని కలిసి, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి వివరణ ఇచ్చుకున్నాక వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కి అందించి వెళ్ళిపోయారు. జనసేన సోషల్ మీడియాలో ఈ విషయం ధృవీకరించింది.

జనసేన అధినేతగా, డెప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్‌, జనసేన మంత్రులు హుందాగా సమర్ధంగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకుంటుంటే, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అరవ శ్రీధర్ దారి తప్పి పార్టీ ప్రతిష్టకు కూడా భంగం కలిగించారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

కనుక ఆ వివాదంపై జనసేన త్రిసభ్య కమిటీ చేసిన సూచన మేరకు ఆయన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చు. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సివస్తే? అని ఆలోచిస్తే ఆయనకే తన పరిస్థితి బోధపడేది.

పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ తప్పూ చేయకపోయినా అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. వాటి వలన ఆయన పట్ల ప్రజలలో సానుభూతి, గౌరవం ఇంకా పెరిగిందే తప్ప కించిత్ తగ్గలేదు. ఎందువల్లనంటే అయన సంయమనం పాటిస్తూ హుందాగా బదులిస్తుండటం వల్లనే.

ఆయన అన్ని అవమానాలు, అవహేళనలు భరిస్తూ, సినిమాలు చేస్తూ ఆ వచ్చే డబ్బుతో పార్టీని నడిపించారనే విషయం అందరికీ తెలుసు. ఆటుపోట్లను తట్టుకొని పవన్ కళ్యాణ్‌ ధైర్యంగా నిలబడటమే కాకుండా ఇంతకాలం రాజకీయ అనామకులుగా ఉండి పోయిన పలువురికి సమాజంలో ఓ గుర్తింపు, గౌరవం కల్పించారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు కూడా దక్కేలా చేశారని జనసేనలో ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమ అధినేత పవన్ కళ్యాణ్‌ని మెప్పించకపోయినా పర్వాలేదు కానీ అయన తమ వలన తలదించుకునే పరిస్థితి కల్పించకుండా ఉంటే చాలు.

రాష్ట్రంలో జనసేన తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. కనుక మిగిలిన ఈ మూడేళ్ళలో పార్టీలో ప్రతీ ఒక్కరూ పవన్ కళ్యాణ్‌ని ఆదర్శంగా తీసుకొని నిరుపేద ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, వారితో మమేకం అవుతూ మంచి పేరు తెచ్చుకుంటే చాలు.

ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు, ప్రయత్నాలే జనసేనని ప్రజలకు చేరువ చేస్తాయనని, ఆవిధంగానే తాము కూడా రాజకీయంగా ఎదగ గలమని గ్రహించడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories