అదుగో పులి… ఇదిగో తోక చందాన టీడీపీ జనసేన పొత్తు రూమర్లు

Janasena Pawan Kalyan -condemns alliance with tdp2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా పని చేసిన పవన్ కళ్యాణ్ గత ఏడాది మార్చిలో ఆ పార్టీతో విభేదించి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన విమర్శలు చేశారు. అసలు వారిద్దరి మధ్యా అంతగా ఎందుకు చెడిందో కూడా ఎవరికీ అర్ధం కాలేదు. ఆ సమయంలో చంద్రబాబుని ఓడించడానికే తాను ఉన్నాను అన్నట్టుగా విమర్శలు చేసే వారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య కాలంలో ఆయన వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద కూడా విమర్శలు సంధించారు. అయితే వాటి మీద జగన్ మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించి ఏకంగా నిత్య పెళ్లికొడుకు అని, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

అప్పటి నుండి పవన్ కళ్యాణ్ జగన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యింది. అది ఏ స్థాయికి చేరిందంటే పవన్ కళ్యాణ్ టీడీపీని విమర్శించడం తగ్గించి వైకాపా మీద ఎక్కువగా గురి పెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావాలని కేంద్రంతో పోరాడాలని చెప్పడం విశేష ప్రాచుర్యం పొందింది. దీనితో ఈ రెండు పార్టీలు మళ్ళీ కలిసి పోతున్నాయి అని పుకార్లు షికారు చెయ్యడం మొదలు పెట్టాయి. కొందరు టీడీపీ నాయకులు తెలిసినా తెలియకపోయినా ఈ పొత్తుపై ఏవేవో మాటలు మాట్లాడటంతో మరింత గా ఊహాగానాలు చెలరేగాయి.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఊహాగానాలతో బాగా ఇబ్బంది పడిన ఆయన జనసేన – టీడీపీ మధ్య పొత్తు చర్చలు మార్చిలో జరుగుతాయి అని చెప్పిన టీజీ వెంకటేష్ పై విరుచుకుపడ్డారు. పొత్తులు పెట్టుకుంటాం అని నీతో ఎవడు చెప్పాడు. అసలు నువ్వు ఎవడవి మాపార్టీతో పొత్తు వుంటుంది అని చెప్పటానికి?, అంటూ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ గతంలో ఈ విషయంపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా మళ్ళీ అవే రూమర్లు పదే పదే వచ్చి, ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.

ఆ పార్టీ మద్దతుదారులను, నాయకులను అయోమయానికి గురిచేస్తున్నాయి. దీనితో పవన్ కళ్యాణ్ మొత్తానికి క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇంతటితో ఇవి ఆగుతాయో లేదో చూడాలి. మరోవైపు ఈ నెల 25వ తారీఖున పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీ అగ్రనేతలతో పొత్తు, సీట్ల పంపకంపై విశాఖపట్నంలో చర్చలు జరపబోతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరీ వంటి జాతీయ నాయకులు ఈ చర్చలకు రావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ADVERTISEMENT
Latest Stories