పవన్‌ కళ్యాణ్‌ మరో గొప్ప అవకాశాన్ని వృధా చేసుకొన్నారా?

JanaSena_Pawan_Kalyan_Looses_Better_Oppurtunityఒక రాజకీయ సభను నిర్వహించడం ఎంత కష్టమో రాజకీయ నేతలకే బాగా తెలుసు. మచిలీపట్నంలో నిన్న జనసేన ఆవిర్భావసభకు అనేక అవరోధాలను ఎదుర్కొని దిగ్విజయంగా నిర్వహించారు. అంతమందితో సభను నిర్వహిస్తున్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌ దానిని సద్వినియోగం చేసుకొని జనసేనపార్టీకి రాజకీయంగా లబ్ధి కలిగేలా చేస్తారనుకొంటే ఆయన ఎప్పటిలాగే భావోద్వేగంతో మాట్లాడుతూ ఓ గొప్ప అవకాశాన్ని వదులుకొన్నారని చెప్పక తప్పదు.

తన ఆదాయం రోజుకి రూ.2 కోట్లని, ప్రజల కోసమే రాజకీయాలలో కొనసాగుతున్నానని, ఏదో ఓ రోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానంటూ పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాటలు ఆ సభకు తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలకు సినిమాలో డైలాగ్స్‌లాగ చాలా అద్భుతంగా వినిపిస్తాయి కనుక వారు చాలా ఆనందించి ఉండవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా టీవీలలో ఆయన సభను చూస్తున్న సాధారణ ప్రజలకు ఇటువంటి మాటలు వ్యర్ధ ప్రసంగంలాగ అనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలు ఆయన నోటి నుంచి వినాలనుకొంటున్న విషయాలు వేరే ఉన్నాయి కనుక!

ADVERTISEMENT

ఆయన బిజెపితో కొనసాగాలనుకొంటున్నారా లేదా?టిడీపీతో పొత్తులు పెట్టుకొంటున్నారా లేదా? పెట్టుకొనే మాటయితే దాదాపు ఎన్ని స్థానాలలో పోటీ చేయాలనుకొంటున్నారు? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చెపుతుననప్పుడు, ఇదే వేదికపై నుంచి పవన్‌ కళ్యాణ్‌ కేంద్రాన్ని గట్టిగా ఎందుకు నిలదీయలేదు? సినిమాల కారణంగా పార్టీకి పూర్తి సమయం కేటాయించలేకపోతున్నందున రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఇంకా ఎప్పుడు పోరాడుతారు? బిజెపి సహకరించడం లేదని స్వయంగా చెప్పేశారు కనుక టిడిపితో కలిసి ప్రజా సమస్యలపై పోరాడేందుకు జనసేన సిద్దమేనా కాదా? రాబోయే ఎన్నికలలో జనసేన కార్యాచరణ ఏవిదంగా ఉండబోతోంది?వంటి అనేక సందేహాలను పవన్‌ కళ్యాణ్‌ ఈ వేదిక ద్వారా సమాధానాలు చెప్పి ఉంటే ఈ సభకు పరిపూర్ణత ఏర్పడి ఉండేది. జనసేన పట్ల రాష్ట్ర ప్రజలలో నిర్ధిష్టమైన అభిప్రాయం ఏర్పడి పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలిగి ఉండేది.

కానీ పవన్‌ కళ్యాణ్‌ మరో గొప్ప అవకాశాన్ని చేజార్చుకొన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సభలకు అన్ని కులమతాల ప్రజలు వస్తారు లేదా టీవీలలో చూస్తుంటారు. కనుక ఇటువంటి వేదికలపై నుంచి పవన్‌ కళ్యాణ్‌ కులాల గురించి మాట్లాడటం వలన పార్టీకి ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండదు. టిడిపి, వైసీపీ, బిజెపి, కాంగ్రెస్‌, వామపక్షాల సభలలో వాటి నేతలు ఏనాడూ ఈవిదంగా మాట్లాడరు. ఎందుకంటే, మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకొని తిరగనక్కరలేదు కదా?

పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ సినిమా షూటింగులకు హాజరుకాక తప్పదు. కనుక మళ్ళీ జనాలకి కనబడరు. ఆయన సినిమాల కబుర్లు వినిపిస్తాయే తప్ప జనసేన రాజకీయాలు ఎవరినీ ఆకర్షించవు. అదే… టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉన్నా, టిడిపి కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతుంటాయి. ఎందుకంటే, టిడిపిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, అచ్చన్నాయుడుతో సహా అనేకమంది సీనియర్ నేతలున్నారు కనుక!

కానీ జనసేన అంటే పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్ పేర్లు మాత్రమే వినిపిస్తుంటాయి. జనసేన సభ అంటే పవన్‌ కళ్యాణ్‌ సభగానే అందరూ చూస్తుంటారు. కనుక జనసేన నాయకులకు ఇటువంటి వేదికలలో ఎక్కువ సమయం కేటాయించి వారు ప్రసంగించేలా చేసి ప్రజల దృష్టిలో పడేలా చేయవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ అదీ చేయలేదు.

కనుక పవన్‌ కళ్యాణ్‌, జనసేన ఇటువంటి చిన్న చిన్న లోపాలను సరిచేసుకొని ముందుకు సాగకపోతే, దాని శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories