“జనతా గ్యారేజ్”పై కుట్ర జరిగిందా?

janatha-garageకొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” ఆల్ టైం టాప్ 3 జాబితాలో చేరిన విషయం తెలిసిందే. ఇంతటి భారీ హిట్ సాధించిన ఈ సినిమా, 50 రోజులు పూర్తయిన మరుక్షణం బుల్లితెరపై ప్రసారం కావడంతో, టీఆర్పీ రేటింగ్స్ విషయంలోనూ ‘జనతా గ్యారేజ్’ దుమ్ము దులుపుతుందని భావించారు. కానీ, అంచనాలు తారుమారై, ఆశించిన రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంలో “జనతా గ్యారేజ్” విఫలమైందని తెలుస్తోంది.

ఒక హిట్ సినిమాకు వచ్చే సాధారణ టీఆర్పీ రేటింగ్స్ తప్ప, రికార్డు స్థాయిని అందుకోక పోవడం వెనుక, ఈ సినిమాపై కుట్ర జరిగిందన్న ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన బుల్లితెరపై ప్రసారం చేసారు. అయితే అంతకు రెండు, మూడు రోజుల ముందు ఈ సినిమా ఫస్ట్ ప్రింట్ ను ‘ఐ ట్యూన్స్’ మరియు మరికొన్ని పైరసీ సైట్ లలో అప్ లోడ్ చేసారని, ఇంటర్నెట్ లో ముందుగానే లీక్ కావడం వలనే, అంచనాలు తారుమారయ్యాయని ప్రచారం జరుగుతోంది.

ADVERTISEMENT

ఇంతటి ఘనకార్యం చేసింది కూడా “జనతా గ్యారేజ్” చిత్ర బృందానికి చెందిన వారే అయ్యుండొచ్చని ఒక అంచనా. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా లీక్ విషయంలో కూడా చిత్ర బృందానికి చెందిన వారే ఉండడంతో, ‘జనతా గ్యారేజ్’ ప్రింట్ ను లీక్ చేసిన వారు కూడా, చిత్ర బృందంలోని వారే అయ్యుంటారని తెలుస్తోంది. ఎందుకంటే, బుల్లితెరపై ప్రసారం అయితే చేసారు గానీ, ఇప్పటివరకు అధికారికంగా “జనతా గ్యారేజ్” డివిడి, బ్లూరేలను విడుదల చేయలేదు.

మరి అలాంటప్పుడు ఆన్ లైన్ లో ముందుగానే ‘జనతా గ్యారేజ్’ ప్రింట్ ఎలా వచ్చింది? ప్రస్తుతం ఇదే ప్రశ్న ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ను కలచివేస్తోంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ రికార్డులు కొట్టి, బుల్లితెరపై కూడా సరికొత్త టీఆర్పీ రేటింగ్స్ ను సాధిస్తాడని మాంచి ఊపులో ఉన్న బుడ్డోడు అభిమానులు, అది సాధించకపోవడంతో, కాస్త నిరుత్సాహ పడినా, జరిగిన విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్న సామెత రీత్యా, ‘జనతా గ్యారేజ్’ లీక్ వీరుడు పట్టుబడతాడా!?

ఒకవేళ దొరికినా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తారా? ఎందుకంటే… “అత్తారింటికి దారేది” సమయంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా పెద్ద ప్రసంగమే చేసారు. ఒక సంవత్సరంలో మీ ముందుకు తీసుకువస్తాను, వదిలిపెట్టను అంటూ అభిమానులను ఉత్సాహపరిచే వ్యాఖ్యలే చేసారు. కానీ జరిగిందేమిటో అందరికీ తెలిసిందే. అయితే ‘జనతా గ్యారేజ్’ విషయంలో కేవలం అది బుల్లితెరకే పరిమితం కావడంతో, అంతటి ప్రాధాన్యత దక్కుతుందో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories