జంధ్యాల సినిమాలు చూసి కూడా నవ్వు రాని తెలుగు ప్రేక్షకుడు ఉన్నాడా? అంటే నమ్మలేం. ఎవరి కామెడీకి నవ్వు వచ్చినా రాకున్నా జంధ్యాల సినిమాను చూసి నవ్వని ప్రేక్షకుడు ఉన్నాడంటే అతన్ని ఓ మ్యూజియంలో పెట్టవచ్చని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతటి ఆహ్లాదకరమైన కామెడీకి కేరాఫ్ అడ్రస్ జంధ్యాల. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం అంతా ‘జబర్దస్త్’ మాదిరి డబుల్ మీనింగ్ డైలాగ్స్, వన్ లైన్ వండర్స్ వచ్చేసాయి. కానీ, అలనాటి ‘జంధ్యాల’ సినిమాలలోని హాస్యాన్ని గుర్తుకు తెచ్చే విధంగా మా సినిమాలో సన్నివేశాలు ఉంటాయి అంటున్నాడు కమెడియన్ కం హీరో అయిన శ్రీనివాసరెడ్డి.
“జయమ్ము నిశ్చయమ్మురా” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీనివాసరెడ్డి, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సదరు సంగతులను చెప్పుకొచ్చారు. ‘దేశవాళీ వినోదం’ పేరుతో అందించబోతున్న ఈ ఎంటర్టైన్మెంట్ కు పునాది జంధ్యాల సినిమాల్లోని హాస్య సన్నివేశాలేనని చెప్పారు. దీనికి అనుగుణంగానే ఇటీవల ఓ మూడు విభిన్న సన్నివేశాలను విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి వాటికి మంచి స్పందన లభించిందని అన్నారు. ప్రవీణ్, కృష్ణభగవాన్ తదితరులతో కూడిన టీజర్ సన్నివేశాలు కాస్త జంధ్యాల మార్క్ హాస్యాన్ని రుచి చూపిస్తూ విడుదలైనవే కావడంతో, ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాను వీక్షించిన త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల వంటి టాప్ దర్శకులు మెచ్చుకుని, తమ సినిమాను ప్రమోట్ చేసారని, వారి అభినందనలు మాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయని, అలాగే ఈ సినిమాలో తనను తీసుకోవాల్సిందిగా జేడి చక్రవర్తి గారు సూచించినట్లుగా దర్శకుడు కనుమూరి శివరాజ్ తనకు చెప్పారని తెలిపారు. అయితే ఎన్ని వేషాలు వేసినా మరో పక్కన కమెడియన్ గా మాత్రం కొనసాగుతానని, ఈ పాత్రలను వదిలే ప్రసక్తే లేదని, అసలు అలాంటి ఆలోచన కూడా లేదని ఇండస్ట్రీ వర్గాలకు ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.



