‘బృందావనం’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ‘క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా… ఒరిజినల్ లోపల అలాగే ఉంది… దాన్ని బయటకు తీసావంటే రచ్చ రచ్చే…’ డైలాగ్ గుర్తుందా! ‘కుశ’ టీజర్ చూసిన తర్వాత సరిగ్గా ఇదే డైలాగ్ గుర్తుకు వస్తుంది. మూడు పాత్రలు పోషిస్తున్న “జై లవకుశ” సినిమాలో ఇప్పటివరకు పరిచయం అయిన ‘జై’ మరియు ‘లవ’ పాత్రలు కొత్తగా ఉన్నాయని ఎన్టీఆర్ ట్రై చేయగా, ఒరిజినల్ క్యారెక్టర్ ‘కుశ’ రూపంలో బయటకు వచ్చాడని ఈ టీజర్ చెప్తోంది.
‘కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా’ అంటూ ‘కుశ’ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు కిర్రాక్ తెప్పించే విధంగా ఉండగా, ఈ క్యారెక్టర్ పూర్తి వినోదాన్ని పంచుతుందన్న విషయాన్ని ‘ఈ డబ్బు తీసుకెళ్ళి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి, ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇప్పించేయండి బాబు…’ అన్న డైలాగ్ తో చెప్పకనే చెప్పారు. దేవిశ్రీ అందించిన ‘జయకృష్ణ ముకుందా మురారి’ అన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా క్యారెక్టర్ తగ్గట్టే పూర్తి ఉత్సాహభరితంగా ఉంది. మొత్తానికి ‘కుశ’ కూడా కుమ్మేసాడన్న విషయం స్పష్టమైంది.
బహుశా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో చిరస్థాయిగా మిగిలిపోయే సినిమా అవుతుందో ఏమో గానీ, మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించి అదరగొట్టేస్తున్నాడు. ఈ మూడు పాత్రలలో కూడా టాప్ స్థాయిలో ‘జై’ పాత్ర ఉండగా, నెక్స్ట్ ‘కుశ’ ఆ తర్వాత ‘లవ’ పాత్రలు ప్రేక్షకులను అలరించేవిగా కనపడుతున్నాయి. సెప్టెంబర్ 21న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం నాడు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.


