టిడిపి మౌనం… రాజకీయ పరిణతి అంటే ఇదేగా?

kalavakuntla-kavitha-bail-tdp-chandrababu-naidu

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయి 10 ఏళ్ళు గడిచినప్పటికీ రెండు రాష్ట్రాలలో రాజకీయాలు పరస్పరం ప్రభావం చూపుతూనే ఉన్నాయి.

ADVERTISEMENT

2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని గద్దె దించడానికి కేసీఆర్‌, జగన్‌కి లోపాయికారిగా సహకరించారు. దానికి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి సైలంట్‌గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. కానీ అది ముట్టిందని కేసీఆర్‌ చెప్పుకోలేకపోయారు.

గత ఏడాది జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే వైసీపి నేతలు మిటాయిలు పంచుకొని, టపాకాయలు కాల్చుకుని తమ శాడిస్ట్ మెంటాలిటీని బయటపెట్టుకున్నారు. అది వారి నైజమని సరిపెట్టుకోవచ్చు.

కానీ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ ‘ఆంధ్రా పంచాయితీలు హైదరాబాద్‌లో పెట్టొద్దు’ అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు అరెస్టుని సమర్ధిస్తున్నట్లు మాట్లాడారు. తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కేటీఆర్‌ చేసిన ఆ వ్యాఖ్యలు కూడా ఓ కారణమని అందరికీ తెలిసిందే.

అయినా జగన్మోహన్‌ రెడ్డి పట్ల కేసీఆర్‌, కేటీఆర్‌ తమ ప్రేమని దాచుకోలేకపోయారు. ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో వారిద్దరూ “జగన్‌ మళ్ళీ అధికారంలోకి వస్తారని మాకు పక్కా సమాచారం ఉందంటూ”, ఆంధ్రా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆంధ్రా ఓటర్ల మనసు తెలుసుకోలేకపోయారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ టిడిపి, చంద్రబాబు నాయుడు పట్ల ఎంత చులకనగా మాట్లాడినప్పటికీ, చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నడూ సంయమనం కోల్పోలేదు. వారి గురించి పొరపాటున కూడా ఎన్నడూ తప్పుగా మాట్లాడలేదు.

ఈవిషయంలో చంద్రబాబు నాయుడు ఏపీలోనే కాదు… తెలంగాణ టిడిపి నేతలని కూడా కట్టడి చేసి ఉంచడం చాలా గొప్ప విషయం.

ఇందుకు తాజా నిదర్శనంగా కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలైనప్పుడు ఏపీ, తెలంగాణ టిడిపిలు మౌనంగా ఉండటాన్ని చెప్పుకోవచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలు ఆమె బెయిల్‌పై బయటకు రావడంపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నాయి. గతంలో కేసీఆర్‌, కేటీఆర్‌ చంద్రబాబు నాయుడు గురించి చులకనగా మాట్లాడారు కనుక ఇప్పుడు కల్వకుంట్ల కవిత బెయిల్‌పై చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కూడా ఏవైనా వ్యాఖ్యలు చేయవచ్చు. కానీ ఏ ఒక్కరూ ఆమె గురించి మాట్లాడలేదు.

రాజకీయాలలో ఈ సంయమనం, పరిణతి చాలా అవసరం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటారు. అందుకు ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories