గత నెల 31వ తేదీన సినీ నటుడు కాలె శ్రీనివాసరావు హైదరాబాదులో కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. రెండు లక్షలు ఇస్తే శ్రీనివాసరావును వదిలేస్తామంటూ అతడి కుటుంబానికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు బేరసారాలకు తెర తీశారు. కిడ్నాపర్ల డిమాండ్లకు తలొగ్గని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో, కిడ్నాప్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు.
అయితే నిఘా వర్గాలకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ కిడ్నాపర్లు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే పనిచేసారు. అయితే శ్రీనివాసరావు ఇంటికి కిడ్నాపర్ల నుంచి వచ్చిన ఫోన్ నెంబరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కిడ్నాపర్ల వివరాలు తెలుసుకుని అవాక్కయ్యారు. సీఐడీ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జలీల్ మరియు స్టూడియో9 ఛానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న జగదీశ్వర్… ఇద్దరూ కలిసి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అలాగే కిడ్నాప్ చేసిన శ్రీనివాసరావును ఎక్కడ ఉంచారన్న వివరాలను పోలీసులు వారి నుంచి సేకరిస్తున్నారు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు చేసిన ఈ నిర్వాకం పట్ల పోలీసులే షాక్ తిన్నారు.మొత్తానికి ఈ కిడ్నాప్ కధ సుఖాంతం కావడంతో సదరు సినీ నటుడు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.



