మేము మా పార్టీ వాళ్ళు చెప్పేదే నిజం… మా గురించి ఇతరులు చెప్తున్నవన్నీ అబద్దాలే… ఈ మీడియాకు మరే పని లేనట్లు ఎప్పుడూ మా వెంట పడుతుంటుంది.
మా ఫామ్‌హౌసులో ఏం జరుగుతోందో… మా కుటుంబంలో ఏం జరుగుతోందో…. అని తొంగి చూస్తుంటారే తప్ప రాష్ట్రంలో, దేశంలో వీలైతే అమెరికాలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు….ఇదేం విచిత్రమో!
“కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకొని నేనే కట్టించా… నేనే డ్రాయింగులు గీసా… ఇలాంటి ప్రాజెక్ట్ ప్రపంచంలో మరెక్కడా లేదు…” అని ఏదో మాట వరసకి అంటే అది పట్టుకొని మామీద కేసులు పెట్టేయడమేనా? ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నానంటే ఎలా?
ఆ పెద్దాయన…. జస్టిస్ పీసీ ఘోష్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయితే కావచ్చు గాక కానీ నేను ఏమి తక్కువ కాదు. ఓ 70 వేలో 80 వేలో పుస్తకాలు చదివిన మేధావిని.
నాలాంటి వాడిని పట్టుకొని అవినీతిపరుడినని నివేదిక ఇస్తారా? ఈ ఒక్క ముక్క చెప్పడానికి వెయ్యి పేజీల నివేదిక ఎందుకో అసలే అర్ధం కాదు.
ఈ రేవంత్ రెడ్డికి మొదటి నుంచి నేనంటే పడదు…. నాపై అసూయతోనే శాసనసభ ఎన్నికలలో అబద్దాలు చెప్పి ప్రజలను బుట్టలో వేసుకొని మమ్మల్ని ఓడించారు.
ఫామ్‌హౌసులో నుంచి బయటకు రాకుండా చేసి శాసనసభ సమావేశాలకు ఎందుకు రావడం లేదని పదేపదే వెక్కిరిస్తుంటారు.
నేనే చాలా మాటకారిని అనుకుంటే నాకంటే మాటకారి ఆ రేవంత్ రెడ్డి. నా ఫామ్‌హౌసే నాకు జైలు అని రెండింటికీ తేడా లేదని ఎద్దేవా చేస్తుంటారు. ఎలా భరించేది ఈ చిల్లర మాటలు?
నేనంటే అసూయతో రేవంత్ రెడ్డి కుళ్ళిపోతుంటారు. అందుకే మేడిగడ్డ బ్యారేజ్‌ని పాడుపెట్టేశారు. అలాంటి వ్యక్తి నన్ను సన్మానించడానికి శాసనసభకు పిలుస్తాడా… కాదు కదా? అందుకే వెళ్ళడం లేదు. పాపం పక్క రాష్ట్రంలో జగన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నాకు కాళేశ్వరం ఆయనకు మద్యం కుంభకోణం కేసు… ఏం చేస్తాం? వాస్తు ఎక్కడో తేడా కొట్టి ఉంటుంది.
మావాడు ఆ పెద్దాయన ఇచ్చిన నివేదికపట్టుకొని శాసనసభలో చర్చ పెడతాడట… తర్వాత చట్టప్రకారం మాపై చర్యలు తీసుకుంటామని మీడియాకు ఒకటే లీకులు…. అయినా ఫోన్‌లో ట్యాపింగ్ కేసులోనే ఇంతవరకు ఏమీ పీకలేకపోయారు… కాళేశ్వరంతో ఏం పీకుతారు…. అని వదిలేయలేము కదా?
చిన్న పామునైన పెద్ద కర్రతోనే కొట్టాలి… కనుక ఆ పెద్దాయన ఇచ్చిన నివేదిక రద్దు చేసిన చెల్లని నోటు వంటిదని , కనుక ఆ నివేదికని కొట్టేయాలని హైకోర్టులో ఓ కేసు పడేయక తప్పలేదు.
కానీ అక్కడా అదే వితండవాదన… మంత్రి వర్గం ఆమోదం తీసుకోకుండా, ఇంజనీరింగ్ నిపుణులు, అధికారుల మాట వినకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని నేనే కట్టించేశానని అందుకే అది అలా తయారయిందని వితండవాదం చేస్తున్నారు.
అప్పుడేదో మాట వరసకి కుర్చీ వేసుకొని నేనే కట్టించా… అని మాట వరకు అంటే ఇంత అనర్ధం జరుగుతుందని అనుకోలేదు… డామిట్!






