హరీష్ అనుకుంటే కవిత అవుట్?

Kalvakuntla Kavitha New Party

బిఆర్ఎస్ పార్టీలో ముసలం పుడితే తెలంగాణ రాజకీయాలపై ఆ ప్రభావం చాలా ఉంటుంది. కల్వకుంట్ల కవిత వ్రాసిన ఒక్క లేఖతో ఆ పార్టీలో ఆ ముసలం పుట్టింది.

ఇదేం పెద్ద విషయం కాదని కేటీఆర్‌ తేలికగా కొట్టి పడేసినప్పటికీ, ఇదే అంశంపై తండ్రి కేసీఆర్‌తో చర్చించేందుకు నేడు ఫామ్‌హౌస్‌కి వెళ్ళారు.

ADVERTISEMENT

జూన్ 2న పార్టీ పరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం గురించి చర్చించేందుకని కవరింగ్ ఇచ్చుకున్నప్పటికీ, వారు చర్చించబోయే అంశం ఆమె లేఖ గురించే అని వేరే చెప్పక్కరలేదు.

ఇంతవరకు హరీష్ రావు పార్టీ వీడుతారు.. సొంత కుంపటి పెట్టుకుంటారు.. అని ఊహాగానాలు వినిపిస్తే వాటిని ఆయన ఖండిస్తున్నారు. ఈ ఊహాగానాల నేపధ్యంలో కేటీఆర్‌ హరీష్ రావు ఇంటికి వెళ్ళి భేటీ అవడంతో దీని గురించి వారు చర్చించుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ వారు ఈ లేఖ గురించి చర్చించుకున్నారని ఇప్పుడు భావించాల్సి వస్తోంది.

హరీష్ రావు బయటకు వెళతారనుకుంటే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వెళుతున్నారు.. తెలంగాణ జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకుంటారు.. అందుకే భారత్‌ జాగృతి పేరుని ఆమె మళ్ళీ తెలంగాణ జాగృతిగా మార్చుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ సొంత కుంపటి భరించే శక్తి లేదనుకుంటే బీజేపిలో చేరవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె లేఖపై బీజేపి నేతలు ‘సాఫ్ట్’గా స్పందిస్తున్న తీరు చూస్తుంటే కల్వకుంట్ల కవిత బీజేపిలో చేరే అవకాశమే ఎక్కువుందనిపిస్తుంది.

అయితే ముందుగా ఆమెను కేసీఆర్‌ పార్టీ నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది లేదా ఆమె రాజీనామా చేసి బయటకు రావాల్సి ఉంటుంది.

ఈ రెండింటిలో ఏదో ఒకటి అనివార్యమే. ఎందుకంటే, ఆమె ఓ పక్క కేసీఆర్‌ జిందాబాద్ అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని అంటున్నారు కనుక!

కేసీఆర్‌ ఆమెని పిలిచి మాట్లాడి పార్టీలో ఏ కీలక పదవో కట్టబెట్టి ఇంటి గుట్టు కాపాడుకోవచ్చు. కానీ ఆమె ఆల్రెడీ ‘ఆపరేషన్ సింధూర్‌’ ప్రకటించి ‘దెయ్యాలతో యుద్ధం’ మొదలుపెట్టేశారు కనుక ఆమెను పార్టీలో ఉంచుకోవడం చాలా ప్రమాదమే.

కనుక ఆమెపై కేసీఆర్‌ సస్పెన్షన్ వేటు వేస్తారా లేదా ఆమె సహనం నశించి పార్టీ వీడుతారా?అనేది మాత్రమే తేలాల్సి ఉంది.

బహుశః ఈరోజు కేసీఆర్‌, కేటీఆర్‌ సమావేశంలో ఏదో ఓ నిర్ణయం తీసుకొని తదుపరి కార్యాచరణ మొదలుపెట్టే అవకాశం ఉంది. కనుక ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం చాలా కీలకమైనదని భావించవచ్చు. కల్వకుంట్ల కవిత పరిస్థితిని బట్టి తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories