ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిన్న అరెస్టు చేసిన కవితను ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం…కోర్ట్ ఆమెను మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి అప్పగించడం అంతా చెకచెకా జరిగిపోయింది. వారం కస్టడీ తరువాత ఈ నెల 23 న తిరిగి కవితని కోర్టులో హాజరు పరచాలంటూ న్యాయమూర్తి నాగపాల్ ఈడీ అధికారులను ఆదేశించారు.
లిక్కర్ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న మాగుంట రాఘవ, శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డి తో కలిసి కవిత సౌత్ సిండికేట్ ఏర్పాటు చేసారంటూ…ఆప్ నాయకులతో కుమ్మక్కై 100 కోట్లు ముడుపులు ఇచ్చి లిక్కర్ పాలసీలో తమకు అనుగుణంగా మార్పులు చేశారనే ఆరోపణలతో కవిత పై రిపోర్ట్ తయారు చేసారు అధికారులు.అలాగే ఇండో స్పిరిట్ కంపెనీలో వాటా కలిగిన అరుణ్ పిళ్ళై అనే డమ్మీ వ్యక్తి ని కవిత ఈ స్కాంలో వాడుకున్నారని ఈడీ అధికారులు కోర్ట్ కు తెలియచేసారు.
కవిత దగ్గర సీజ్ చేసిన 10 ఫోన్లను డేటా రికవరీకి పంపితే అందులో 4 ఫోన్ల నుండి డేటా రికవరీ రాలేదంటూ ఆరోపించారు అధికారులు. అయితే ఈకేసులో భాగంగా కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు అందచేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కవిత భర్త తో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసారు.
అయితే కవిత కు కోర్ట్ రిమాండ్ విధించడంతో ఆమెకు హై బిపి వచ్చినదంటూ, ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలంటూ కవిత న్యాయవాది విన్నపాలు కోర్టు నిరాకరించింది. అయితే ఇంటి నుంచి భోజనం, మందులు, దుస్తులు పంపవచ్చు అని వాటికీ అనుమతినిచ్చింది న్యాయస్థానం. కవిత కేసు తాలూకా న్యాయసలహాల నిమిత్తం కేటీఆర్ ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం.
అయితే బాబు అరెస్టు సందర్భంలో బాబుకి న్యాయసహాయం కోసం ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఢిల్లీలో మకాం వేసి కొన్ని రోజుల పాటు అక్కడే వుండి పోవాల్సి వచ్చింది. ఈ సందర్భంలో తండ్రిని జైలుకు వదిలి కొడుకు ఢిల్లీ పారిపోయాడు అంటూ అవహేళన చేసిన నాయకులు, కొన్ని మీడియా ఛానెల్స్ ఇప్పుడు నోరుమెదపలేకున్నారు. కుటుంబంలోని వ్యక్తికీ ఆపద వస్తే దాని నుండి వారిని బయట పడే అన్నిమార్గాలను వెతకాల్సిన బాధ్యత ఆ కుటుంబంలోని కొడుకుదో…అన్నదో..అవుతుంది.
అలాంటి సమయంలో వారు ఎక్కడ ఉన్నారన్నది కాదు ఏ పని మీద ఉన్నారన్నదే ముఖ్యం. ‘పక్క వాడికి ఆపద వస్తే రాజకీయాలు మాట్లాడి… మనవాడికి ఆపద వస్తే విలువలు మాట్లాడకూడదు’ అనేది రాజకీయ నాయకులు తెలుసుకోలేక పోయిన కనీసం మీడియా ఛానెల్స్ అయినా గ్రహించాలని ఆశిద్దాం..!




