ఆంధ్రా రాజకీయాలలో కుల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో కుల ప్రభావం తక్కువే. కానీ ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కనుక రాజకీయాలలో మత ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ కులం ఏవిధంగా రాజకీయాలను శాశిస్తుంటుందో అక్కడ మతం శాశిస్తుంటుంది. ఇది బిజేపికి, మజ్లీస్ పార్టీలకు అడ్వాంటేజ్‌గా మారుతోంది.
కనుక ముస్లిం ఓట్లు చేజారిపోకుండా కాపాడుకునేందుకు నాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ తప్పనిసరిగా మజ్లీస్ పార్టీతో సఖ్యంగా ఉండాల్సి వస్తోంది. అందుకే ‘రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తమ ముందు చేతులు కట్టుకు నిలబడాల్సిందే’ అని ఓవైసీ సోదరులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పుకుంటూనే ఉన్నారు. తెలంగాణలో ఈ చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు.
కనుక ఈ మత రాజకీయాలకు విరుగుడుగా ఆంధ్రాలో మాదిరిగా కుల రాజకీయాలను ప్రోత్సహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు, కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ కనుక అది సాధ్యపడలేదు. కనుక సామాజిక న్యాయం అంటూ అన్ని పార్టీలు పాట పాడుతుంటాయి.
ఇటీవల సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత కూడా సామాజిక తెలంగాణ సాధనే తన లక్ష్యం అంటూ నేడు సరూర్ నగర్‌లో ఓ సభ నిర్వహించారు.
తాను అగ్రకులంలో పుట్టినప్పటికీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కూడా సామాజిక న్యాయం జరుగడం లేదన్నారు. తద్వారా దాని కోసం పోరాడుతున్న తాను అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెప్పారు.
ఇదే ముక్క ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే చెప్పి ఉండి ఉంటే నేడు ఆమె మాటకు చాలా విలువ ఉండేది. కానీ అప్పుడు నేరెళ్ళలో దళితులపై కేసులు నమోదు చేసి చిత్రహింసలు పెట్టినప్పుడు మౌనంగా ఉండిపోయి, ఇప్పుడు వారి కోసం పోరాడుతానంటే నమ్మశక్యంగా ఉంటుందా?
అయితే రాజకీయాలలో ఉన్నావారు ఇలా ఏదో ఓ అంశంతో ప్రజలను ప్రసన్నం చేసుకొని అధికారంలోకి రావాలనుకోవడం సహజం. కనుక ఆమె కూడా సామాజిక న్యాయం పేరుతో రావాలని ఆశ పడుతున్నారని సరిపెట్టుకోవచ్చు.
అయితే ఆంధ్రా బూచి, చంద్రబాబు బూచి, నీళ్ళ రాజకీయాలు, తెలంగాణ సెంటిమెంట్ వంటి అనేక అస్త్రాలు చేతిలో ఉంచుకొని, సామాజిక న్యాయాన్ని కూడా వాడుకోవాలనుకోవడం దేనికంటే కారుకి స్టెఫీనీ వంటిదే అనుకోవాలేమో?




