రీల్ లైఫ్ లో పుష్ప vs షెకావత్ మధ్య జరిగిన ఇగో పోరులో పై చేయి సాధించిన పుష్ప రియల్ లైఫ్ లో మాత్రం అల్లు vs రేవంత్ అంటూ సాగుతున్న వివాదంలో తన పట్టు నిలుపుకోలేకపోతున్నారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తగ్గేదెలా అన్నట్టుగా దూకుడుగా ముందుకెళుతుంటే అల్లు అర్జున్ కుటుంబం మాత్రం నష్ట నివారణ చర్యలు చెప్పట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి రేవంత్ ప్రభుత్వంతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా గాంధీభవన్ కు వచ్చిన చంద్రశేఖర్, కాంగ్రెస్ ఇంచార్జ్ దీపదాస్ మున్షి ని కలిసేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు తానూ సిద్ధంగా లేనని తిరస్కరించడంతో నిరాశతో గాంధీ భవన్ నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు బన్నీ మామ చంద్ర శేఖర్ రెడ్డి.
అయితే టి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం అల్లు అర్జున్ మామ మా కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అల్లు అర్జున్ కూడా తమ కాంగ్రెస్ కుటుంబ సభ్యుడేనని, వారికి పార్టీ నుండి ఎటువంటి సాయం చేయడానికైనా మేము సిద్ధం అంటూ ప్రకటించారు.
ఇలా సొంత పార్టీలోనే ఒకరు కలవడానికి సైతం అంగీకరించకుండా మొండి చెయ్యి చూపడం, దానికి విరుద్ధంగా మరొకరు ప్రభుత్వం నుండి ఎటువంటి సాయమైన అందించడానికి సిద్ధం అంటూ ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని మరోసారి బయటపెట్టినట్టు అయ్యింది.
ఇటు సినీ పరిశ్రమ తరుపున కూడా ముఖ్యమంత్రిని కలిసి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఎంట్రీ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సమస్య నుండి అల్లు అర్జున్ ను ఎలా అయినా బయట పడేయాలనే ఆలోచనలో అటు కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ కు ఎదురైనా ఈ అనుకోని వివాదాన్ని ఎలా అయినా పరిష్కరించుకోవాలని సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దల అనుమతి కోసం వేచి చూస్తున్నారు.




