నిరర్ధక ఆస్తుల పేరిట తమిళనాడులో దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి భక్తులు విరాళంగా ఇచ్చిన భూముల అమ్మకాల విషయంలో పెద్ద దుమారమే లెగిసింది. దీనితో ఈ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టమని ముఖ్యమంత్రి జగన్ టీటీడీ బోర్డుని ఆదేశించిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీని మీద సంచలన ఆరోపణ చేశారు.
“టిటిడి ఆస్తుల అమ్మకంపై బిజెపి పోరాటానికి దిగివచ్చినట్లు నటించి ఒక చీటింగ్ జీవో 888 ను ఇచ్చి వైసీపీ ప్రభుత్వం ఆఖరికి దేవుడిని కూడా మోసం చేసింది. 2016లో టిటిడిబోర్డ్ ఇచ్చిన ఆర్.253 నిలుపుదల చేశారు తప్ప..ఈ ప్రభుత్వంలో టిటిడి బోర్డ్ ఇచ్చిన ఆర్.309ను రద్దు చేయలేదు. ఇది పూర్తిగా మోసపూరితం,” అంటూ ఆయన ఆరోపించారు.
భూముల అమ్మకం రద్దుకు సంబంధించిన జీవోలో కన్నా ఆరోపించినట్టే 2016 జీవో రద్దు చేస్తున్నట్టుగానే, తాజాగా జగన్ ప్రభుత్వం లో వచ్చిన జీవో గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీనితో ఇప్పుడు జగన్ ప్రభుత్వం మళ్ళీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.
గతేడాది ఏపీలో కనీవినీ ఎరుగని స్ధాయిలో అఖండ మెజారిటీతో అధికారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు రేపటి ఆలోచన అనేది లేకుండా అప్పులు తెచ్చి మరీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుని సంబరాలు చేసుకునే సమయంలో ఈ వివాదం తెరమీదకు వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది.





