తీగ లాగితే డొంక కదులుతోంది అన్నట్లుగా… హీరోయిన్ భావన ఉదంతం తర్వాత హీరోయిన్లు ఎవరికి వారు స్వచ్చంధంగా తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఈ జాబితా చాలా పెద్ద స్థాయికి చేరుకోగా, తాజాగా ఒకప్పటి హీరోయిన్ కస్తూరి కూడా ఇండస్ట్రీ పోకడలను తూర్పారబట్టింది. “అవకాశాల పేరుతో పడకగదికి రమ్మనే అలవాటు సినీ పరిశ్రమలో ఉందని, అటువంటి బాధితుల్లో తాను కూడా ఒకదానినని” సీనియర్ నటి కస్తూరి పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన వైద్యుడిని పెళ్లాడి అక్కడే స్థిరపడిన కస్తూరి, తన కుమార్తెకు నృత్యం నేర్పించేందుకు ఇటీవల చెన్నై రాగా, తాజాగా ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. కొందరు ఆలోచనా రాహిత్యంతో, మరికొందరు పారితోషికం విషయంలో డిమాండ్ కారణంగా, ఇంకొందరు సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై నటిగా ఎదగలేకపోతున్నారని, అలాగే తన విషయంలో వారు ఆశించింది జరగకపోవడంతో వారి సినిమాల నుంచి తనను తప్పించారని తెలిపారు.
ఓ హీరో కారణంగానే అలా జరిగిందని పేర్కొన్న కస్తూరి, ఇప్పుడా హీరో రాజకీయాల్లో ఉన్నాడని, అతడికి ఇగో అని, అయినా తాను అతడిని గౌరవిస్తానని తెలిపారు. ‘నో’ చెబితే ఆయన తట్టుకోలేరని, అతడితో ఓ సినిమాలో కూడా నటించానని, ఆ సమయంలో తనపై విసుక్కునే వారని, కోపంగా ఉండేవారని అన్నారు. ఆ తర్వాత అతడి రెండు చిత్రాల నుంచి తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన కస్తూరి, ఆ హీరో పేరును మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. చూడబోతుంటే… ప్రతి హీరోయిన్ వెనుక ఏదొక “కధ” ఉండడం సహజమే అనిపించేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.



