పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “కాటమరాయుడు”లో ఒక తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ, ఇటీవల ఆ సినిమా వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలపై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరిచే సౌలభ్యం ఉన్న నేపధ్యంలో… ఓ వ్యక్తి మాత్రం శివబాలాజీని అన్ పార్లమెంటరీ భాషలో దుర్భాషలాడాడు. అయితే ఎందుకు తనను అంత అసభ్యంగా తిట్టావో సమాధానం చెప్పమంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను శివబాలాజీ పోస్ట్ చేసాడు.
అంతేకాదు, ఈ కామెంట్స్ ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీసులో శివబాలాజీ ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తి గురించి విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియాను తమ భావాలు వ్యక్తపరచడానికి వినియోగించుకోవాలి గానీ, ఇలా అభ్యంతరకంగా, ఎదుటి వ్యక్తులను ఇబ్బందులు పెట్టే విధంగా ఉండకూడదని నెటిజన్లకు హితవు పలుకుతున్నారు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలపై ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ మరీ పెచ్చుమీరుతున్నాయని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వలన చివరికి వాళ్ళే ఇరుకున పడతారని తాజా ఉదంతం చెప్పకనే చెప్తోంది. బహుశా అందరి సెలబ్రిటీలు శివబాలాజీ మాదిరి కేసులు నమోదు చేయకపోవచ్చు గానీ, ఈ సంఘటన వలన వారు కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటే, చివరికి నెటిజన్లకు చుక్కలు కనపడడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.



