కౌశల్ ఆర్మీ… టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-2 చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఈ పేరు సుపరిచితమే. హౌస్ లో ప్రధాన పోటీదారుగా, విజేతగా నిలిచే సత్తా ఉన్న వ్యక్తిగా ఉన్న కౌశల్ పేరిట, సోషల్ మీడియాలో భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. కౌశల్ ఎన్నిమార్లు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చినా, కౌశల్ ఆర్మీ ఆన్ లైన్ లో ఓట్లు వేసి, ఆయనకు మద్దతుగా నిలుస్తూ, బయటకు రానీయకుండా కాపాడుతోంది.
[m9ad]
కౌశల్ గెలవాలని కోరుకుంటూ మద్దతుదారులు ఇటీవల హైదరాబాద్, విజయవాడ నగరాల్లో భారీ ర్యాలీలు కూడా చేశారు. ఇదే సమయంలో కౌశల్ ఆర్మీ ఓ పెయిడ్ ఆర్మీ అని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి కూడా! తాజాగా విజయవాడలో కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2కే రన్ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వందలాది మంది బైకులపై కౌశల్ గెలవాలని కోరుతూ, ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించే పేరిట ర్యాలీ నిర్వహించారు.
ఇదే ర్యాలీలో సీక్రెట్ గా కెమెరాను దాచుకున్న ఓ యువకుడు, కౌశల్ బొమ్మ ఉన్న టీ షర్టుతో వచ్చిన యువకుడిని ప్రశ్నించగా, తన బండిలో వచ్చేటప్పుడు 200 రూపాయలతో పెట్రోల్ కొట్టించారని, వెళ్లేటప్పుడు మరో 200 రూపాయలు కొట్టిస్తామన్నారని చెప్పాడు. మొత్తం పది మందిమి వచ్చామని, సాయంత్రం పార్టీ కూడా ఉందని అన్నాడు. ఇదంతా ప్రసాద్ అనే వ్యక్తి చేయిస్తున్నాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.





