నా ఫోన్ ఎవరు ట్యాపింగ్‌ చేశారో… కల్వకుంట్ల కవిత

kavitha-phone-tapping

కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత బుధవారం టీవీ 5 తెలుగు న్యూస్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఆమె అనేక అంశాల గురించి అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. వాటిలో ఫోన్ ట్యాపింగ్‌ అంశం కూడా ఒకటి.

ADVERTISEMENT

“మీది, మీ భర్తది, మీ ఇంట్లో పనివాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ కూడా జరిగిందనే వార్తలు వాస్తవమేనా?దీనికి ఎవరు బాధ్యులని భావిస్తున్నారు?” అని ఆ చానల్ సీఈఓ, జర్నలిస్ట్ మూర్తి ఆమెను సూటిగా ప్రశ్నించారు.

“అవును. మా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి. మా తండ్రి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కూతురినైన నా ఫోన్‌ ట్యాపింగ్ చేసే సాహసం ఎవరు చేశారో తెలీదు. కానీ కేసీఆర్‌ చేయించారని నేను భావించడం లేదు. ఆయన ఇటువంటి నీచమైన పనులు చేయరు కూడా. ఒకవేళ ఏదైనా తెలుసుకోవాలంటే నాతో నేరుగా మాట్లాడేవారు. కానీ నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా ఫోన్లు ట్యాపింగ్ జరగడం మా అందరికీ పెద్ద షాక్.

ప్రభుత్వం లేదా పార్టీలో చాలా హైలెవెల్లో ఉన్నవారి ఆదేశం మేరకే మా ఫోన్లు ట్యాపింగ్ చేశారని నేను భావిస్తున్నాను. కనుక దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోవలసిందే. అందుకే నా చుట్టూ ఉన్నవారిని విచారణకు హాజరవ్వాలని సిట్ కోరితే తప్పకుండా వెళ్ళి తెలిసిన విషయాలు చెప్పాలని నేను సూచించాను,” అని కల్వకుంట్ల కవిత చెప్పారు.

అంటే కేసీఆర్‌ హయంలో ఫోన్ ట్యాపింగ్‌ జరగడం, కల్వకుంట్ల కవితతో సహా బిఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడటం వాస్తవమే అని ఆమె ధృవీకరించారనుకోవచ్చు. కానీ దీంతో తన తండ్రికి సంబందం ఆమె లేదని ‘క్లీన్ చిట్’ ఇచ్చేశారు కానీ ఈ కేసులో అరెస్ట్‌ అయిన, విచారణకు హాజరైన పోలీస్ అధికారులు ఆ నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకే తాము ఫోన్ ట్యాపింగ్‌ చేశామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి కదా?

ఆ పెద్దలు కేసీఆర్‌ కాదని కవిత చెపుతున్నారు. అయితే మరెవరు? కేటీఆర్‌ లేదా హరీష్ రావా?

నిన్న ఇంటర్వ్యూలో కూడా ఆమె తన తండ్రి కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని, అవే తన తండ్రి కళ్ళకు గంతలు కట్టి పార్టీని భ్రష్టు పట్టించేస్తున్నాయని, వాటిని వదిలించుకుంటే తప్ప ముందుకు సాగడం కష్టమన్నారు.

తాను కేవలం కేసీఆర్‌ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని మరోసారి విస్పష్టంగా చెప్పేశారు. కనుక ఆ హైలెవెల్ అండ్ పవర్‌ఫుల్ దెయ్యాలే తన ఫోన్‌ ట్యాపింగ్ చేయించి ఉండవచ్చని కల్వకుంట్ల కవిత చెపుతున్నట్లే అనుకోవచ్చేమో?ఆమె సిట్ అధికారుల వద్దకు వెళ్ళి ఇదే మాట వారికి చెపితే ఈ కేసు కొలిక్కి వస్తుంది కదా?

ADVERTISEMENT
Latest Stories